కాంగ్రెస్ పాలన వల్లే.. పాలమూరు వలసలు, ఆకలి చావులు : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
పెండింగ్‌కు పర్యాయ పదమే కాంగ్రెస్ అని విమర్శించారు. వారి వల్లే పాలమూరు ప్రాంతంలో వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు.
నాలుగున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలన పాపమే పాలమూరుకు శాపంగా మారింది. ఇక్కడి వలసలు, ఆకలి చావులకు కాంగ్రెస్ పార్టీనే కారణమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా జడ్చర్లలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలపై మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అన్నీ పెండింగే అని ఆరోపించారు.
నీళ్లు పెండింగ్, నిధులు పెండింగ్, కరెంట్ పెండింగ్, ఫించన్ పెండింగ్, ప్రజల సమస్యల పరిష్కారం పెండింగ్.. కాంగ్రెస్ పాలన అంటేనే పెండింగ్ పాలన అని దుయ్యబట్టారు. పెండింగ్‌కు పర్యాయ పదమే కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్ వల్లే పాలమూరు ప్రాంతంలో వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఇక్కడకు వచ్చి ఓట్లడుగుతున్నారని దుయ్యబట్టారు. అధికారం ఎప్పుడు దక్కుతుందా అని కాంగ్రెస్ నేతలు కళ్లల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. వారి పాలనలో జిల్లాను అధోగతి పట్టించారు.. ఇక మీకు ప్రజలు ఓటేసే అవకాశమే లేదని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో కళ్ల ముందు కనిపిస్తున్నదని అన్నారు. నాలుగున్నర ఏళ్లకే కేసీఆర్ పాలన చూసి పాలమూరు ప్రజలు 2018లో 14 సీట్లకు గాను 13 సీట్లు కట్టబెట్టారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే పాలకుల సామర్థ్యానికి గీటురాయని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఐదు దశాబ్దాల పాలనలో పాలమూరు జిల్లాకు చేసిన అన్యాయానికి.. ఆ పార్టీ నాయకులు జీవితాంతం ఊడిగం చేసినా ప్రాయశ్చితం కలగదని అన్నారు. కాంగ్రెస్‌కు జిల్లాలో స్థానమే లేదని.. వారి పొలిటికల్ డ్రామాలు ఇక్కడ సాగవని మంత్రి చెప్పారు.
కర్ణాటక ఫలితాలు చూసి కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారు. అక్కడ ప్రత్యామ్నాయం లేకనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. తెలంగాణలో ఆ పరిస్థితి లేనే లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి మరోసారి కేసీఆర్ సీఎం అవడం ఖాయమన్నారు. కర్ణాటకను చూడగానే ఇక్కడి కాంగ్రెస్ నేతలకు ఆశలు మొదలయ్యాయి. పార్టీలో ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకే పాదయాత్రలు చేస్తున్నారు. అంతే గానీ తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో కాదని మంత్రి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు.