నాగయ్య ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్య

రోడ్డునపడ్డ నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్

Advertisement
Update:2025-02-06 12:47 IST

లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ములుగు జిల్లా, బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య (నాగేశ్వర్ రావు) గారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని హరీశ్‌రావు విచారం వ్యక్తం చేశారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖం చాటేస్తే, ఆ కుటుంబానికి ధైర్యం బీఆర్ఎస్ పార్టీ చెప్పింది . నాగయ్యకు మంచి వైద్యం అందించి, ప్రాణాలు కాపాడేందుకు ములుగు జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంతో ప్రయత్నించింది. కానీ దురదృష్టవశాత్తు నాగయ్య ప్రాణాలు వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన చావుతోనైనా అర్హులైన పేదలకు పథకాలు ఇవ్వాలని అధికారులకు చెబుతూ పురుగుల మందు తాగి, ఆసుపత్రి పాలైన నాగయ్య దుస్థితికి ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. ఉన్నదాంతో కుటుంబాన్ని పోషిస్తూ జీవితం గడుపుతున్న నాగయ్య కుటుంబంలో గ్రామ సభల పేరిట నిప్పులు పోసింది కాంగ్రెస్ ప్రభుత్వం. భర్తను, తండ్రిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న భార్య, ముగ్గురు ఆడబిడ్డలను ఎవరు ఆదుకోవాలని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే యావతో, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా, జాబితా విడుదల చేస్తూ ప్రజల్లో గందరగోళం రేపింది.దీంతో పాటు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు అంటూ బాహాటంగా ప్రకటించడంతో గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పట్ల ప్రజల్లో ఆందళన మొదలైంది.దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, ఏడాది పాలనలో మీరు చేసిందేమున్నదని నిలదీశారు. గ్రామ సభల సాక్షిగా తిరగబడ్డ జనం, ఎక్కడిక్కడ నిలదీసిన దృశ్యాలు.. మీ 14 నెలల పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపాయన్నారు.

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం. రోడ్డునపడ్డ నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలారా.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ పార్టీపై కొట్లాడుదాం. హక్కుగా రావాల్సిన పథకాలను సాధించుకుందాం. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నామని హరీశ్‌ పేర్కొన్నారు. 

Tags:    
Advertisement

Similar News