ఏ గట్టునుంటారు..? - సినిమా పాటతో కేటీఆర్ ప్రచారం

ప్రధానిగా మోదీ బాధ్యత‌లు చేప‌ట్టే నాటికి గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.400 ఉండేద‌న్నారు. కానీ, ఇప్పుడు రూ.1200కు పెరిగిందన్నారు. అలాగే మోదీ కంటేముందు పెట్రోల్ లీట‌ర్ రూ.70 ఉంటే, ఇప్పుడు రూ.110కి పెరిగింద‌న్నారు.

Advertisement
Update:2022-11-01 18:55 IST

మునుగోడు ఉప ఎన్నిక ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో ఉన్నప్పటికీ.. ఆ పార్టీ హడావుడి పెద్దగా కనిపించడం లేదు. కాంగ్రెస్ ఓట్లు కూడా ఈ ఎన్నికలో కీలకంగా ఉండొచ్చు.. అయితే ఎన్నిక సమీపిస్తున్న కొద్దీ.. బీజేపీ, టీఆర్ఎస్ నడుమ నువ్వా?.. నేనా? అన్న రేంజ్ లో పోటీ నెలకొంది. అటు బీజేపీ నేతలు.. ఇటు టీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇటీవల మునుగోడు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ నిర్వహించిన సభ మరింత హీట్ పుట్టించింది.

ఇదిలా ఉంటే ఇవాళ మంత్రి కేటీఆర్.. మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపూర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మీరంతా సినిమాలు చూస్తుంటారు కదా.. రంగస్థలం చూశారా..? ఆ సినిమాలో చెప్పినట్లు ఆ గట్టునుంటారో..? ఈ గట్టునుంటారో..? తేల్చుకోండి. ఇక్కడి ఎమ్మెల్యే రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం ఈ ఎన్నిక వచ్చింది. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం పేదప్రజల పక్షాన ఉన్నారు..' అంటూ మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్‌. ప్రధానిగా మోదీ బాధ్యత‌లు చేప‌ట్టే నాటికి గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.400 ఉండేద‌ని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు రూ.1200కు పెరిగిందన్నారు. అలాగే మోదీ కంటేముందు పెట్రోల్ లీట‌ర్ రూ.70 ఉంటే, ఇప్పుడు రూ.110కి పెరిగింద‌న్నారు. బీజేపీకి ఓటు వేస్తే కూర‌గాయ‌ల ధ‌ర‌లు పెరుగుతాయ‌న్నారు.

Tags:    
Advertisement

Similar News