రజినీకి అర్థమైంది, ఈ గజినీలకు అర్థం కావట్లేదు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇల్లు కట్టడం అంటే అప్పుల్లో కూరుకుపోవడమే అన్నట్లుగా ఉండేదన్నారు హరీష్ రావు. ఇప్పుడు ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఇస్తున్నామని, పేదలు ఆత్మగౌరవంతో ఉండేలా చేస్తామని చెప్పారు.
హైదరాబాద్ అభివృద్ధి గురించి ఎక్కడో ఉన్న రజినీకాంత్ కు అర్థమైంది కానీ.. మన దగ్గర ఉన్న గజినీలకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలే ప్రచారకర్తలు కావాలన్నారు. వాటి గురించి ప్రజలే ప్రచారం చేయాలన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పరిధిలోని కొల్లూరులో రెండో విడత డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీని మంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. కొల్లూరు టౌన్ షిప్ లో విద్య, వైద్యం, రవాణా సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు హరీష్ రావు.
దొంగ డిక్లరేషన్లతో వస్తున్నారు జాగ్రత్త..
ఎన్నికలు వస్తున్నాయంటే హామీలు, నినాదాలు, దొంగ డిక్లరేషన్లతో కొన్ని పార్టీలు ఓట్ల కోసం వస్తుంటాయని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీ.. ఎన్ని డిక్లరేషన్లు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. బీఆర్‌ఎస్ పార్టీకే ఓట్లు వేస్తామని వారంతా సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని వివరించారు.
అప్పుడు అప్పులు, ఇప్పుడు ఆత్మగౌరవం..
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇల్లు కట్టడం అంటే అప్పుల్లో కూరుకుపోవడమే అన్నట్లుగా ఉండేదన్నారు హరీష్ రావు. ఇప్పుడు ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఇస్తున్నామని, పేదలు ఆత్మగౌరవంతో ఉండేలా చేస్తామని చెప్పారు. మహిళల కోసం సీఎం కేసీఆర్ చాలా పథకాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు హరీష్. సీఎం కేసీఆర్ కిట్లు ఇస్తే.. ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు తప్ప ఏమీ జరగలేదని గుర్తు చేశారాయన. గోదావరి, కృష్ణా జలాలను తీసుకొచ్చి హైదరాబాద్ లో తాగునీటి కొరతను సీఎం కేసీఆర్ తీర్చారన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఈ పని చేయలేకపోయాయని అన్నారు. హైదరాబాద్ లో లక్షమందికి డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు హరీష్ రావు.
♦