టీవీ చర్చలో ఫైటింగ్ సీన్.. రచ్చ చేస్తున్న బీజేపీ

నువ్వు కబ్జాదారుడివంటే, లేదు నువ్వే పెద్ద కబ్జాకోరువంటూ ఇద్దరూ తిట్టుకున్నారు. ఆ తర్వాత కలబడ్డారు. అక్కడితో ఆ కార్యక్రమం ఆగిపోయింది. ఇకపై ఇలాంటి చర్చలకు అనుమతి ఇచ్చే విషయంలో పోలీసులు కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.

Advertisement
Update:2023-10-26 07:55 IST

గెలుపెవరిది..? అంటూ ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చ.. రచ్చగా మారింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అన్ని పార్టీల నేతల్ని ఒకే వేదికపై పిలిచి చర్చ చేపట్టిన సందర్భంలో అక్కడ ఫైటింగ్ సీన్ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వివేకానంద, బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఆ తర్వాత చర్చచూసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు కలబడ్డారు. కుర్చీలు పైకి లేచాయి. తోపులాటను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ గొడవపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. గతంలో ఇతర దేశాల్లో టీవీ చర్చల్లో ఇలాంటి ఫైటింగ్ సీన్లు చూశామని ఇప్పుడు తెలంగాణలో కూడా ఇది మొదలైందని, నేషనల్ మీడియా హడావిడి చేస్తోంది. మొత్తంగా ఈ ఎపిసోడ్ ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది.


కుత్బుల్లాపూర్ ఎపిసోడ్ పై బండి సంజయ్ మండిపడ్డారు. తమ అభ్యర్థిపై దాడి చేస్తారా అని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. బీజేపీ నేతలు తలచుకుంటే బీఆర్ఎస్ నేతలు రోడ్లపై తిరగలేరంటూ సవాల్ విసిరారు. భౌతిక దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రెచ్చగొట్టింది ఎవరు..?

చర్చలు సానుకూలంగా జరిగితే టీవీ ఛానెళ్లకు రేటింగ్ రాదు. టీఆర్పీ పెరగాలంటే గొడవ జరగాలి, వాళ్లు సర్దిచెప్పినట్టు కవర్ చేయాలి. అన్నిచోట్లా ఇది జరిగేదే. అయితే తాజాగా జరిగిన ఓపెన్ డిబేట్ లో ఈ గొడవ పెరిగి పెద్దదైంది. స్టేజ్ పై ఉన్నామనే విషయాన్ని మరచిపోయిన నాయకులు ముందు మాటల యుద్ధానికి తెరతీశారు. నువ్వు కబ్జాదారుడివంటే, లేదు నువ్వే పెద్ద కబ్జాకోరువంటూ ఇద్దరూ తిట్టుకున్నారు. ఆ తర్వాత కలబడ్డారు. అక్కడితో ఆ కార్యక్రమం ఆగిపోయింది. ఇకపై ఇలాంటి చర్చలకు అనుమతి ఇచ్చే విషయంలో పోలీసులు కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. 

Tags:    
Advertisement

Similar News