తెలంగాణలో అగ్రి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఐటీసీని ఆహ్వానించిన కేటీఆర్
తెలంగాణలో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ల కోసం 10,000 ఎకరాలను సిద్ధం చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ITC అక్కడ తన యూనిట్లను విస్తరించడానికి ముందుకు వస్తే అన్ని రకాల మద్దతు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తెలంగాణలోని ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లో అగ్రి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఐటీసీ లిమిటెడ్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఆహ్వానించారు.
మెదక్ లో ఐటీసీ అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీని కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ల కోసం 10,000 ఎకరాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ITC అక్కడ తన యూనిట్లను విస్తరించడానికి ముందుకు వస్తే అన్ని రకాల మద్దతు అందజేస్తామని కేటీఆర్ చెప్పారు.
ములుగు జిల్లాలోని బల్లార్‌పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బిఐఎల్‌టి)ని పునరుద్ధరించడానికి ఐటిసికి కావాల్సిన అన్ని ప్రోత్సాహకాలను ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఐటిసి తయారీ హబ్ యొక్క అవకాశాలను పరిశీలించాలని పూరీని కేటీఆర్ కోరారు. తెలంగాణ దేశం మధ్యలో ఉందని, లాజిస్టిక్‌గా ఇంతకంటే మంచి ప్రదేశం దేశంలో మరొకటి ఉండదని కేటీఆర్ తెలిపారు.
ITCని దాని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకోసం, ముఖ్యంగా బింగో బ్రాండ్ బంగాళాదుంప చిప్స్ కోసం స్థానిక రైతుల నుండి ముడిసరుకును కొనాలని కేటీఆర్ అభ్యర్థించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారంతో రైతు బంధు సమితిలు నాణ్యమైన ముడిసరుకును అందజేస్తాయని చెప్పారు.
ఈ రోజు మెదక్ లో ITC ప్రారంభించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, దాదాపు 59 ఎకరాల విస్తీర్ణంలో, 6.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని ప్రారంభ పెట్టుబడి రూ. 450 కోట్లు. దశలవారీగా ఆశీర్వాద్ గోదుమ పిండి, సన్‌ఫీస్ట్ బిస్కెట్లు, బింగో చిప్స్, యిప్పీ నూడుల్స్‌తో సహా ఇతర ITC ఫుడ్ బ్రాండ్‌లను ఉత్పత్తి చేస్తుంది.