మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం -వెంకట్ రెడ్డి..

మొదటినుంచీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా మాటల తూటాలు మరింత ఘాటుగా పేలడంతో వ్యవహారం పతాక స్థాయికి చేరుకుంది.

Advertisement
Update:2022-08-23 08:03 IST

మునుగోడులో ఏపార్టీకి ఆ పార్టీ తమదే విజయం అంటోంది. మెజార్టీలు లెక్కేసుకుంటోంది. అధినాయకులతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ స్థానిక నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తోంది. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమంటూ ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడంతో ఈ ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నారు, కానీ అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొన్నాళ్లుగా ఆయన రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ప్రచారానికి రానన్నారు. తీరా ఇప్పుడు అసలు మునుగోడులో కాంగ్రెస్ మునిగిపోవడం ఖాయమంటూ శాపనార్థాలు పెట్టారు.

ఢిల్లీలో ఏం జరిగింది..?

ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న వెంకట్ రెడ్డి తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీలో ఆయన సోనియా గాంధీని కలుస్తారని, తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై ఫిర్యాదులు చేస్తారని అనుకున్నారంతా. కానీ అక్కడ అలాంటి అవకాశం దొరికినట్టు లేదు. కాంగ్రెస్ అధినాయకత్వం వెంకట్ రెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చిందా, ఒకవేళ ఇచ్చినా ఆయన వాదన పరిగణలోకి తీసుకోలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత మాత్రం వెంకట్ రెడ్డి మరింత ఫైర్ లో ఉన్నారు. మునుగోడు ప్రచారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంలేదన్నారు.

4వేల ఓట్లు వస్తే ఎక్కువే..?

మునుగోడులో కాంగ్రెస్ ది సిట్టింగ్ స్థానం. కానీ ఈసారి జరిగే ఎన్నికలో తమ పార్టీకి 3 నుంచి 4 వేల ఓట్లు వస్తే ఎక్కువేనంటున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అంతిమంగా టీఆర్ఎస్, బీజేపీలలో ఎవరో ఒకరికి విజయం దక్కుతుందని, కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోతుందని జోస్యం చెప్పారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ కి ఎలాంటి ఫలితం వచ్చిందో, మునుగోడులో కూడా అదే రిపీట్ అవుతుందన్నారు వెంకట్ రెడ్డి.

టీపీసీసీకి అధ్యక్షుడు మారాలి..

మొదటినుంచీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా మాటల తూటాలు మరింత ఘాటుగా పేలడంతో వ్యవహారం పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందు టీపీసీసీ ఎన్నిక జరగాలని డిమాండ్ చేస్తున్నారు వెంకట్ రెడ్డి. 30 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్న తనలాంటివారికి గుర్తింపు ఇవ్వకుండా, నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు వెంకట్ రెడ్డి. మాణిక్యం ఠాగూర్ ని ఇన్ చార్జ్ గా తీసేసి, కమల్‌ నాథ్‌ లాంటి అనుభవం కలిగిన వారికి ఆ పదవి ఇవ్వాలని, కొత్త పీసీసీని ఎంపిక చేయాలని అన్నారు. చివరిగా తాను పార్టీని వీడి వెళ్లేది లేదని ముక్తాయించారు వెంకట్ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News