కిషన్ రెడ్డి, పవన్ కల్యాణ్ గొడవ.. సోషల్ మీడియా రచ్చ
జనసేన సాన్నిహిత్యం తెలంగాణలో బీజేపీకి లాభం చేకూర్చకపోగా నష్టం కలిగించిందని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. కిషన్ రెడ్డి నేరుగా బయటకు చెప్పకపోయినా, ఆయన మనసులో మాట అదేనంటున్నారు నెటిజన్లు.
నిప్పు లేనిదే పొగరాదంటారు, కానీ నిప్పు లేకుండానే సోషల్ మీడియా పొగ పెట్టేయగలదు. ఫేక్ న్యూస్ తో గొడవలు పెట్టగలదు. అలాంటి గొడవే ఇప్పుడు బీజేపీ, జనసేన మధ్య మొదలైంది. తెలంగాణలో బీజేపీ-జనసేన కూటమి దారుణంగా విఫలమైందనే విషయం అందరికీ తెలిసిందే. బీజేపీ సొంతగా ఓట్లు, సీట్లు పెంచుకోగలిగింది కానీ, జనసేన డిపాజిట్లు పోగొట్టుకుని దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ మాటకొస్తే జనసేన పోటీ చేసిన సీట్లలో ఒకటిరెండు బీజేపీకి ఇచ్చినా మంచి ఫలితాలు వచ్చేవనే మాట వినపడుతోంది. ఇదే విషయం కిషన్ రెడ్డి కూడా అన్నారని, జనసేన పొత్తుతో తాము మోసపోయాని విమర్శించారని, ముఖ్యంగా పవన్ కల్యాణ్ పై ఆయన మాట తూలారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
పవన్ కల్యాణ్ ని నమ్ముకుని గ్రేటర్ లో నష్టపోయామని, ఆయన పక్కన స్టేజ్ పై కూర్చుంటే ప్రజలు చీప్ గా చూశారని, ఒంటరిగా పోటీ చేసి ఉంటే.. గ్రేటర్ లో నాలుగైదు సీట్లు బీజేపీ గెలిచి ఉండేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టు కొన్ని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రచారం మొదలైంది. నిజంగానే కిషన్ రెడ్డి ఈ మాటలన్నారనే విధంగా ఆ ప్రచారం జరిగింది. జనసైనికులు కూడా ఓ దశలో సీరియస్ గా రియాక్ట్ అయ్యారు, కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. దీంతో నేరుగా ఆయనే రంగంలోకి దిగారు. సుదీర్ఘ వివరణ ఇస్తూ ట్వీట్ వేశారు కిషన్ రెడ్డి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. ఆ ప్రచారాన్ని తాను ఖండిస్తున్నానని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా అసత్యాలను ప్రచారం చేస్తున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడ్డట్టయింది.
మనసులో మాట అదేనా..?
జనసేన సాన్నిహిత్యం తెలంగాణలో బీజేపీకి లాభం చేకూర్చకపోగా నష్టం కలిగించిందని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. కిషన్ రెడ్డి నేరుగా బయటకు చెప్పకపోయినా, ఆయన మనసులో మాట అదేనంటున్నారు నెటిజన్లు. ఆయన ధైర్యం చేయకపోయినా బీజేపీ సానుభూతిపరులెవరో ఈ ప్రచారానికి తెరతీశారంటున్నారు.
*