కేసీఆర్ తన పిల్లలను మాపైకి ఉసిగొల్పి అన్నింటిని అడ్డుకుంటున్నరు
సీఎంగా కేసీఆర్ పదేళ్ల పాటు ఏ ప్రతిపక్ష నాయకుడిని కలవలేదని, అధికార, విపక్ష నేతలు కలుసుకోకూడదన్నట్లు తయారు చేశారని సీఎంధ్వజం
గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్ల నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేసిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. పేదల ఇళ్ల నిర్మాణ పథకాన్ని కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, వేలాది ఇళ్లను పూర్తి చేయకుండా ఎక్కడికక్కడ వదిలేశారని మండిపడ్డారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్ల నిర్మాణాలను మేము పూర్తి చేస్తున్నామని సీఎం తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఇటీవల రూ. 195 కోట్లు విడుదల చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. మొబైల్ యాప్ ద్వారా శుక్రవారం నుంచి లబ్ధిదారులను నమోదు చేయనున్నారు. ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్ ఏర్పాటు చేయనున్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల ఎంపిక చేయనున్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..కేసీఆర్ తనకు అవసరమైన ప్రగతిభవన్‌ను ఆఘమేఘాల మీద పూర్తి చేశారు. వాస్తు కోసం సచివాలయాన్ని కూలగొట్టి కొత్తదాన్ని వేగంగా నిర్మించారు. ప్రతి జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలను వేగంగా నిర్మించుకున్నారని విమర్శించారు. గజ్వేల్, జన్వాడ ఫామ్‌హౌస్‌ల నిర్మాణంపై మాత్రమే కేసీఆర్ దృష్టి పెట్టారు. పేదల ఇళ్ల పథకాన్ని కేసీఆర్ ఏనాడూ ప్రాధాన్య అంశంగా భావించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగించింది. రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రాన్ని రూ. 7 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారు. గతంలో వైఎస్‌ఆర్, చంద్రబాబు ప్రజల తరఫున సీఎంలను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. సీఎంను కలిసి నియోజకవర్గానికి నిధులు కావాలని అడిగేవారు. సీఎంగా కేసీఆర్ పదేళ్ల పాటు ఏ ప్రతిపక్ష నాయకుడిని కలవలేదన్నారు. అధికార, విపక్ష నేతలు కలుసుకోకూడదన్నట్లు తయారు చేశారని ధ్వజమెత్తారు. వాళ్లు చేయనిది మేం కూడా చేయెద్దన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ తన ఇద్దరు పిల్లలను మాపైకి ఉసిగొల్పి అన్నింటిని అడ్డుకుంటున్నారు. పదేళ్ల పాటు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తీసుకురాలేదన్నారు. ఏ పాలకుడైనా ప్రజల అభిప్రాయాలకు తలవంచక తప్పదన్నారు. నిజాం ప్రభువు కూడా అయిష్టంగానే హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు. కేసీఆర్ కూడా ప్రజల తీర్పును ఇప్పటికైనా గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ నుంచి ఎన్నికైన 65 మంది ఎమ్మెల్యే కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంటే 119 మంది ఎమ్మెల్యేలని సీఎం చెప్పారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రారని ప్రశ్నించారు. ఆ సీటు ఖాళీ ఉండటం సరికాదన్నారు. సర్కారు నడువద్దా? అని రాహు.. కేతుల్లాంటి రాక్షసులను (కేటీఆర్, హరీశ్‌లను ఉద్దేశించి) కేసీఆర్ ఎందుకు ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను పిలుస్తమన్నారు. అలాగే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను కూడా ప్రోటోకాల్ మినిస్టర్‌గా పొన్నం ప్రభాకర్ వెళ్లి ఆహ్వానిస్తారని సీఎం తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, వాటిని ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.