కురుమూర్తి స్వామి దయతోనే సీఎం అయ్యాను

ఇక్కడి బిడ్డనై ఉండి సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయకపోతే ప్రజలు క్షమించరన్న సీఎం రేవంత్‌రెడ్డి

Advertisement
Update:2024-11-10 14:41 IST

పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిదంటే కురుమూర్తి స్వామి దయే అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్‌లో కురుమూర్తి స్వామిని సీఎం దర్శించుకున్నారు. అంతకుముందు కురుమూర్తి ఆలయ సమీపంలోని ఘాట్‌ రోడ్డు కారిడార్‌ నిర్మాణానికి సీఎం రేవంత్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం కురుమూర్తి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం ముఖ్యమంత్రికి అర్చకులు వేదాశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదల తిరుపతిగా కురుమూర్తిస్వామిని కొలుస్తారని చెప్పారు. ఇక్కడ దర్శించుకుంటే తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్లేనని తెలిపారు. ఇప్పటికీ కురుమూర్తి స్వామి ఆలయంలో మౌలిక సదుపాయాలు లేవు. అందుకే రూ. 110 కోట్లతో ఘాట్‌ రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. ఆలయానికి ఏం కావాలో కలెక్టర్‌ నివేదిక ఇస్తే నిధులు ఇస్తామన్నారు.

దేశంలో ఏ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలోనైనా పాలమూరు ప్రజల కృషి ఉన్నది. మన రాష్ట్రంలో మాత్రం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు పూర్తికాలేదని విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో పాలమూరుకు పరిశ్రమలు, ప్రాజెక్టులు రాలేదు. ఇక్కడ ఇంకా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో పచ్చని పంటలు పండాలన్నారు. మక్తల్‌, నారాయణపేట్‌, కొడంగల్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. పాలమూరు అభివృద్ధిని కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇక్కడి బిడ్డనై ఉండి సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయకపోతే ప్రజలు క్షమించరు. పాలమూరు ప్రజలు ఓట్లు వేస్తేనే కేసీఆర్‌ రెండు సార్లు సీఎం అయ్యారు. 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక సీఎంను ఈ ప్రాంతం ఇచ్చిందన్నారు. అందుకే పాలమూరు రుణం తీర్చుకుంటామన్నారు. యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేలా చూస్తామన్నారు. ప్రతి గ్రామానికి, తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత తనది అన్నారు. విద్య, వైద్యం ఉపాధి కోసం నిత్యం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజ నర్సింహా, రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News