హైదరాబాద్ లో భారీ వర్షం.. 2 రోజులపాటు ఎల్లో అలర్ట్

ఈరోజు తెల్ల‌వారుజామున నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షంతోపాటు.. గంటకు 30కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Advertisement
Update:2023-09-03 11:10 IST

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ లో ఈరోజు నుంచే వర్షాలు మొదలయ్యాయి. సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడుతుందని రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండు రోజులపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

గడచిన 24 గంటల్లో తెలంగాణలో అత్యధికంగా మహబూబ్‌ నగర్ లో 15.35 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లాలో 14.18 సెంటీమీటర్లు సూర్యాపేటలో 13.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా మారేడ్‌ పల్లిలో 4.2 సెంటీమీటర్లు, ముషీరాబాద్‌లో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈరోజు తెల్ల‌వారుజామున నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షంతోపాటు.. గంటకు 30కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో తెల్ల‌వారుజాము నుంచి వ‌ర్షం కురుస్తున్న నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ అధికారుల‌ను మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అప్ర‌మ‌త్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రజలు అత్యవసర సేవల కోసం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయాల‌ని సూచించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని సూచించారు. 

Tags:    
Advertisement

Similar News