కాంగ్రెస్ కి ఓటు వేస్తే అబద్ధాలను ఆమోదించినట్టే..

రైతు బంధు.. దుక్కి దున్నడానికి, కలుపు తీయడానికి ఇవ్వాలని, సిగ్గు లేకుండా కళ్ళాల్లో వడ్లు పోసిన తర్వాత ఇస్తారా అని నిలదీశారు హరీష్ రావు.

Advertisement
Update:2024-05-05 13:06 IST

కాంగ్రెస్ కి ఓటు వేస్తే, అబద్ధాలను ఆమోదించినట్టేనని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ఇప్పటి వరకూ చెప్పింది అబద్ధాలేనని, లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆ అబద్ధాలను మరింత బలంగా చెబుతోందని, వారికి బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికల్లో ఓడించాల్సిందేనన్నారు. అదే సమయంలో బీజేపీకి ఓటు వేసి ఇబ్బందులకు గురికావొద్దని, బీఆర్ఎస్ కి ఓటు వేసి, తెలంగాణ గళాన్ని పార్లమెంట్ లో వినిపించాలన్నారు.

ఒట్లు, తిట్లు..

సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికెళ్లినా దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారని, లేదంటే కేసీఆర్ ని తిట్టడం మొదలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేసీఆర్ అడిగితే.. ఆయనపై దుర్భాషలాడుతున్నారని మండిపడ్డారు.

క్షమాపణలు చెప్పాల్సిందే..

రైతు బంధు ఆలస్యం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి అందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. రైతు బంధు దుక్కి దున్నడానికి, కలుపు తీయడానికి ఇవ్వాలని, సిగ్గు లేకుండా కళ్ళాల్లో వడ్లు పోసిన తర్వాత ఇస్తారా అని నిలదీశారు. అపుడు ప్రామిసరీ నోట్లు, ఇప్పుడు బాండ్ పేపర్ల పేరుతో రేవంత్ రెడ్డి నాటకాలాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్‌లో నడుస్తోందని, రైతు బంధు గోవిందా, కల్యాణ లక్ష్మీ గోవిందా, తులం బంగారం గోవిందా, కేసీఆర్ కిట్టు గోవిందా.. గోవిందా... గోవిందా అంటూ సెటైర్లు పేల్చారు. బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు తప్ప ప్రజలకు చేసేది ఏం లేదని విమర్శించారు.

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు.. బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ ని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అంటేనే కరువని, కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ ని గెలిపించాలని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News