పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే రైతుల ఆత్మహత్యలు : సీఎం కేసీఆర్

75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా దళితులు ఆన్యాయానికి గురవుతున్నారు. ఈ దుస్థితి పోవాలంటే కేంద్రంలోని పార్టీలను మార్చడమే కాదు. తమ ఆకాంక్షలను గెలిపించుకునే దిశగా చైతన్యం కావాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు.

Advertisement
Update:2023-06-12 06:29 IST

కేంద్రంలోని పాలకులకు చిత్తశుద్ధి, లక్ష్య శుద్ధి లేకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దేశంలో ప్రకృతి ప్రసాదించిన నీరు, వ్యవసాయ యోగ్యమైన భూమి, విద్యుత్‌కు అవసరమైన బొగ్గు నిల్వలు, ఇతర ప్రకృతి వనరులు అన్నీ అందుబాటులో ఉన్నాయి. అయినా సరే ఈ దేశంలోని రైతాంగం ఆత్మహత్యలు చేసుకోవడం శోచనీయం. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా దళితులు ఆన్యాయానికి గురవుతున్నారు. ఈ దుస్థితి పోవాలంటే కేంద్రంలోని పార్టీలను మార్చడమే కాదు. తమ ఆకాంక్షలను గెలిపించుకునే దిశగా చైతన్యం కావాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు.

మధ్యప్రదేశ్ బీఆర్ఎస్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుద్దసేన్ పటేల్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో పాటు 200 మంది కీలక నేతలు ఆదివారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలోని ప్రభుత్వ పాలన ఇంకా లక్ష్యాన్ని విస్మరించి, నిర్లక్ష్యంగానే కొనసాగుతోంది. దశ దిశ లేని పరిపాలన భవిష్యత్‌కు గొడ్డలి పెట్టుగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ వ్యవస్థాపకులు, సిద్ధాంతకర్తలు, తాతలు, తండ్రుల పేర్లు చెప్పుకొని రాజకీయాలు చేసే పరిస్థితులు చెల్లవని, ఇప్పడు దేశ ప్రజలకు పేర్లతో పని లేదు.. పని చేయగలిగిన వారితోనే పని అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఒక పార్టీని ఓడించి, ఇంకో పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీ పేర్లు, నాయకుల పేర్లు మారుతాయి తప్ప.. ప్రజలకు ఒరిగేది ఏమీ లేదన్నారు. పని విధానంలో మార్పు తీసుకొని వచ్చే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునే బాధ్యత ప్రజలదే అని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే.. రెండేళ్లలోనే దేశంలోని రైతాంగానికి, ప్రజలకు అవసరమైన విద్యుత్‌ను 24 గంటల పాటు అందజేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని.. దేశాన్ని మార్చడానికి ఏర్పాటు చేసిన ఒక మిషన్ అని పేర్కొన్నారు. మన ఓటును పని చేయనివారికి కాకుండా.. మన కోసం పని చేసుకునే వారికి వేస్తేనే.. మన ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పారు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు మధ్యప్రదేశ్‌లో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. మన కష్టాలను ఇతరులు తీర్చరు.. మనమే తీర్చుకోవాలని సూచించారు.

స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిపోయినా.. ఆదివాసీలు, దళితులు, బహుజనులు ఇంకా పీడితులుగానే కొనసాగాల్సిన దుస్థితి నెలకొన్నది. ఇలాంటి పరిస్థితి ఇంకెన్నాళ్లు ఉండాలని ప్రశ్నించారు. దేశంలో మార్పు కోసం బుద్ధి జీవులు, మేధావి వర్గం ఆలోచించాలని కోరారు. తప్పుడు వాగ్ధానాలతో విద్వేషాలు రెచ్చగొడుతూ.. ఏమైనా చేసి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కొనసాగుతున్న వారి దుర్మార్గాలను నిలువరించడంలో ఈసీ వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి మధ్యప్రదేశ్‌లో సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. అక్కడ గ్రామగ్రామాన తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు.

Tags:    
Advertisement

Similar News