ఉమ్మడి నల్గొండకు వరాలజల్లు.. రూ.1544 కోట్లతో అభివృద్ధి

నల్గొండ బిడ్డల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మునుగోడుని, నల్గొండను గుండెల్లో పెట్టుకుంటానని సీఎం కేసీఆర్‌ ఆనాడే చెప్పారని, ఆ హామీ నేడు అమలు చేస్తున్నామని అన్నారు మంత్రి కేటీఆర్.

Advertisement
Update:2022-12-01 19:28 IST

మునుగోడు విజయం తర్వాత తొలిసారిగా ఆ నియోజకవర్గంతోపాటు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రుల బృందం అధికారులతో సమీక్ష నిర్వహించింది. జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై మంత్రి కేటీఆర్‌, ప్రశాంత్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, జగదీశ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌ సమీక్ష చేపట్టారు. జిల్లా అభివృద్ధికి రూ.1544 కోట్లు కేటాయించబోతున్నట్టు తెలిపారు.

రాబోయే ఆరేడు నెలల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో రూ.1544కోట్ల నిధుల్ని 12 నియోజకవర్గాల్లో ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించారు మంత్రులు. నల్గొండ బిడ్డల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మునుగోడుని, నల్గొండను గుండెల్లో పెట్టుకుంటానని సీఎం కేసీఆర్‌ ఆనాడే చెప్పారని, ఆ హామీ నేడు అమలు చేస్తున్నామని అన్నారు మంత్రి కేటీఆర్.

నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఒకే పార్టీ విజయం సాధించడం చరిత్రలో ఇదే తొలిసారి అని, అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించడం అసాధారణ విషయం అని చెప్పారు కేటీఆర్. నల్గొండ జిల్లా గులాబీ జెండాను ఎలాగైతే గుండెల్లో పెట్టుకుందో, నల్గొండ జిల్లా బిడ్డలు సీఎం కేసీఆర్‌ ను ఎలా గుండెల్లో పెట్టుకున్నారో, అలాగే తాము కూడా నల్గొండను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. ఈ ప్రాంత సమస్యలు, పరిస్థితులు అధ్యయనం చేసే అవకాశం తమకు వచ్చిందని ఇచ్చిన హామీలన్నిటినీ సకాలంలో అమలు చేస్తామన్నారు కేటీఆర్.

మునుగోడులో ఇలా..

మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి, దండుమల్కాపూర్‌ లో టాయ్‌ పార్క్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్‌. ఆర్ అండ్ బి డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో మునుగోడులో రూ.100కోట్లతో రహదారుల విస్తరణ చేపడతామన్నారు. పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో రూ.170కోట్లు , మున్సిపల్‌ శాఖ నేతృత్వంలో చండూరు మున్సిపాలిటీకి రూ.30కోట్లు, చౌటుప్పల్‌ కు రూ.80కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. గిరిజన ఆవాస ప్రాంతాల్లో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.25కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడతామని, రూ.8కోట్లతో 5 సబ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. చండూరుని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్తగా 4 హ్యాండ్‌ లూమ్‌ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఎన్నికలకు ముందు ఓ మాట.. ఎన్నికల తర్వాత మరోమాట చెప్పకుండా.. నల్లగొండ జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. వచ్చే ఎన్నికల్లోపు కొత్తగా కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేస్తామన్నారు. ఏడాదిలోగా హామీలన్నీ నెరవేరుస్తామన్నారు.


Tags:    
Advertisement

Similar News