భట్టి ప్రోటోకాల్ వివాదం.. యాదాద్రి ఈవో బదిలీ
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు తొలి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట ఆలయ ఈవో రామకృష్ణరావుపై బదిలీ వేటు వేసింది రేవంత్ సర్కార్. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనలో ప్రోటోకాల్ పాటించలేదన్న కారణంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆయనను బదిలీ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రోటోకాల్ ఇష్యూ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఈవోగా ఎ.భాస్కర రావుకు బాధ్యతలు అప్పగించారు.
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు తొలి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ పాల్గొన్నారు. వేద ఆశీర్వచనం ఇచ్చే టైమ్‌లో మిగతా మంత్రుల కంటే కాస్త తక్కువ ఎత్తున్న స్టూల్‌పై డిప్యూటీ సీఎం కూర్చోవడంతో వివాదం చెలరేగింది. డిప్యూటీ సీఎం భట్టికి అవమానం జరిగిందంటూ సోషల్‌మీడియాలో చర్చ జరిగింది.
ఈ వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి వివరణ కూడా ఇచ్చారు. తాను ఇష్టపూర్వకంగానే తక్కువ ఎత్తున్న స్టూల్‌పై కూర్చున్నానని చెప్పారు. అయినప్పటికీ నష్ట నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈవోపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక మరోసారి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు ఆలయ అధికారులు. ఒకే ఎత్తు ఉన్న మరో 10 పీటలను కొనుగోలు చేశారు. దీంతో ఆలయంలో మొత్తం పీటల సంఖ్య 14కు చేరింది. 14 మంది వీవీఐపీలకు ఒకేసారి వేద ఆశీర్వచనం ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.