భయపెడుతున్న భారీ వర్షాలు.. తెలంగాణ యంత్రాంగం అప్రమత్తం

ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధంగా ఉండాలని, స్థానికులను చైతన్యవంతం చేసేలా కేబుల్ టీవీ లు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా సమాచారం తెలియపరచాలన్నారు. జలపాతాల వద్దకు ఎవరినీ వెళ్లనీయొద్దన్నారు సీఎస్ శాంతికుమారి.

Advertisement
Update:2023-07-26 21:14 IST

ఇప్పటికే తెలంగాణలో భారీ వర్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాబోయే రెండు రోజులు మరింత కీలకం అంటోంది వాతావరణ విభాగం. దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొన్నారు.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాబోయే 2రోజులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. గోదావరి బేసిన్ లో పలు ప్రాజెక్టులు, చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని, కుంటలు, కాలువలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయని గుర్తు చేశారు. నిండిన ప్రతి చెరువు వద్ద, ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న కాజ్- వే లవద్ద పోలీస్ అధికారులను నియమించి తగు జాగ్రత చర్యలను చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, అక్కడ వారికి అవసరమైన వంట సామగ్రి అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.


వర్షాలకు దెబ్బతిన్న రాష్ట్ర, నేషనల్ హైవేలను వెంటనే మరమ్మతులు చేయాలన్నారు సీఎస్ శాంతికుమారి. భద్రాచలంలో ఇప్పటికే ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారని, గోదావరి కి వచ్చే వరదను సమీక్షిస్తూ తగు జాగ్రత చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామాలలో శానిటేషన్ పనులు ముమ్మరంగా నిర్వహించాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధంగా ఉండాలని, స్థానికులను చైతన్యవంతం చేసేలా కేబుల్ టీవీ లు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా సమాచారం తెలియపరచాలన్నారు. జలపాతాల వద్దకు ఎవరినీ వెళ్లనీయొద్దన్నారు సీఎస్ శాంతికుమారి.

పోలీస్ శాఖకు సంబంధించి ఇప్పటికే అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు డీజీపీ అంజనీకుమార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల ప్రాంతంలోని రెండు గ్రామాల్లో 60 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశాలు జారీచేశారు డీజీపీ. 

Tags:    
Advertisement

Similar News