ఏపీ రోడ్డు ప్రమాదంలో తెలంగాణవాసుల దుర్మరణం.. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్
ఘోర ప్రమాదంలో తెలంగాణ వాసులు మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఏపీలోని పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 10 మందికి గాయాలయ్యాయి. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఆ సమయంలో ఆటోలో 23 మంది ఉండగా.. వీరిలో ఆరుగురు దుర్మరణం చెందారు. నల్గొండ జిల్లాకు చెందిన వీరంతా.. కూలీ కోసం వెళ్తున్నారు.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వీరు.. పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడుకు వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. రోడ్డు ప్రమాద ఘటన తెలుసుకున్నవెంటనే దామరచర్ల పోలీసులు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా..
ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లి సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో తెలంగాణ వాసులు మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు.
గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుకు ఆదేశించారు. ఇక ఈ సంఘటనపై వెంటనే విచారించి తగిన సహాయం చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డిని కూడా ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియాను సీఎం కేసీఆర్ ప్రటించారు.