చైతన్య కాలేజ్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసు: నలుగురి అరెస్ట్
సాత్విక్ తన సూసైడ్ నోట్ లో తన ఆత్మహత్యకు కారణమైన నలుగురి పేర్లు రాశాడు. శ్రీ చైతన్య కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఆచార్య, క్యాంపస్ ఇంఛార్జ్ నరేష్, శోభన్ తనను వేధిస్తున్నారంటూ సాత్విక్ సూసైడ్ నోట్‌లో రాశాడు. తననే కాకుండా విద్యార్థులందరినీ ఈ నలుగురు దారుణంగా వేధిస్తున్నారని సాత్విక్ తన లేఖలో పేర్కొన్నాడు.
హైదరాబాద్ నార్సింగిలోని చైతన్య కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాత్విక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాత్విక్ ఆత్మహత్యకు కారణమైన నలుగురు చైతన్య కాలేజీ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సాత్విక్ తన సూసైడ్ నోట్ లో తన ఆత్మహత్యకు కారణమైన నలుగురి పేర్లు రాశాడు. శ్రీ చైతన్య కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఆచార్య, క్యాంపస్ ఇంఛార్జ్ నరేష్, శోభన్ తనను వేధిస్తున్నారంటూ సాత్విక్ సూసైడ్ నోట్‌లో రాశాడు. తననే కాకుండా విద్యార్థులందరినీ ఈ నలుగురు దారుణంగా వేధిస్తున్నారని సాత్విక్ తన లేఖలో పేర్కొన్నాడు.
సాత్విక్ సూసైడ్ లెటర్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు కృష్ణారెడ్డి, ఆచార్య, నరేష్, శోభన్ లపై కేసు నమోదు చేశారు. ఈ రోజు ఆ నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారికి నార్సింగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి రాజేంద్రనగర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
మరో వైపు సాత్విక్ ఆత్మహత్య సంఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో విద్యాశాఖ ఓ కమిటీని నియమించింది. ఇప్పటికే కమిటీ సభ్యులు శ్రీ చైతన్య కాలేజీని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. సాత్విక్ ఆత్మహత్యకు గల కారణాలపై తోటి విద్యార్థులను ఆరా తీస్తున్నారు.