తెలంగాణకు పవర్ కట్ చేసిన కేంద్రం.. మరో రెండు రోజులు కరెంటు కష్టాలు
చాన్నాళ్ల తర్వాత తెలంగాణ డిస్కమ్‌లు డిమాండ్ మేరకు విద్యుత్‌ను సప్లయ్ చేయలేకపోయాయి. ఇందుకు కేంద్ర విద్యుత్ శాఖ జారీ చేసిన ఆదేశాలే కారణమని తెలంగాణ అధికారులు ఆరోపిస్తున్నారు.
'గోండు గూడేల నుంచి జూబ్లీహిల్స్ వరకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఢిల్లీలో అయినా కరెంట్ పోతుంది కానీ.. హైదరాబాద్‌లో మాత్రం కరెంట్ పోదు. ప్రత్యేక రాష్ట్రంలో మనం సాధించుకున్న విజయాల్లో ఇదీ ఒకటి' అని సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఓపెనింగ్ సందర్భంగా చేసిన వ్యాఖ్య. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎవరికి నచ్చలేదో కానీ.. తెలంగాణకు కరెంటు కోతంటే ఏంటో రుచి చూపించారు. చాన్నాళ్ల తర్వాత తెలంగాణ డిస్కమ్‌లు డిమాండ్ మేరకు విద్యుత్‌ను సప్లయ్ చేయలేకపోయాయి. ఇందుకు కేంద్ర విద్యుత్ శాఖ జారీ చేసిన ఆదేశాలే కారణమని తెలంగాణ అధికారులు ఆరోపిస్తున్నారు. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్, ఎనర్జీ ఎక్చేంజ్ నుంచి తెలంగాణ విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు చేయకుండా గత అర్థరాత్రి నుంచి నిషేధం విధించింది.
పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ. 1380 కోట్ల బకాయి పడిందని, అందుకే ఈ నిషేధం విధిస్తున్నామని పేర్కొంది. దేశంలోని 13 రాష్ట్రాలు బకాయిలు పడగా.. అందరికన్నా ఎక్కువగా తెలంగాణ బకాయిలే ఉన్నాయని పేర్కొన్నది. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ. 1360 కోట్ల మేర బకాయిలు చెల్లించిందని, అయినా సరే కేంద్ర విద్యుత్ సంస్థలు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విద్యుత్ కొనుగోలుపై నిషేధం విధించిందని అధికారులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ కొనుగోలు, అమ్మకాలకు ఎలాంటి అంతరాయం కల్పించవద్దని హైకోర్టు ఆదేశించినా.. కేంద్రం మాత్రం పూర్తి ఏకపక్ష ధోరణిలో వ్యవహరించిందని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది.
శుక్రవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సహా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. డిమాండ్ మేరకు విద్యుత్ సప్లయ్ లేకపోవడంతో డిస్కమ్‌లు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయలేకపోయాయి. దీంతో సీఎం కేసీఆర్ విద్యుత్ సంక్షోభంపై అత్యవసరంగా సమీక్ష చేశారు. ప్రజలు, వ్యాపారాలు, పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విద్యుత్ సరఫరాను మెరుగు పరచాలని ఆదేశించారు. తెలంగాణకు విద్యుత్ అమ్మకుండా ఆదేశాలు ఇవ్వడంపై ఆయన కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి అని దుయ్యబట్టారు.
తెలంగాణలో శుక్రవారం డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా కాలేదని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. మనకు అందుబాటులో ఉన్న విద్యుత్ ప్లాంట్లు, హైడల్, సోలార్ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసి సరఫరా చేయాలని జెన్కోలను సీఎం ఆదేశించినట్లు తెలిపారు. మరో రెండు రోజుల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొచ్చని మంత్రి చెప్పారు. విద్యుత్ బకాయిలు చెల్లించినా.. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్, ఎనర్జీ ఎక్ఛేంజ్‌లు విద్యుత్ కొనకుండా నిషేధం విధించాయని ఆయన చెప్పారు. కరెంటు బాకీలు తీర్చినా, హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా కేంద్రం పక్షపాతంగా వ్యవహరిస్తోందని చెప్పారు.
తెలంగాణలో ఇవాళ 20 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్‌ను సరఫరా చేయలేకపోయినట్లు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి రూ. 1360 కోట్ల బకాయిలు చెల్లించినా ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదని అన్నారు. జెన్కోలతో ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుందని.. ఆ మేరకు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుందని ప్రభాకర్ అన్నారు. అయితే నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నిషేధం కారణంగా.. ఆ విద్యుత్ మన రాష్ట్రానికి రావడం లేదని అన్నారు. అవసరమైన చర్యలు తీసుకోమని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని.. ఆ మేరకు విద్యుత్ శాఖ పని చేస్తోందని ప్రభాకర్ వివరించారు.