రాష్ట్రానికి రానున్న సీఈసీ రాజీవ్ కుమార్.. అసెంబ్లీ ఎన్నికలపై కీలక సమీక్షలు
కేంద్ర ఎన్నికల సంఘ ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో 17 మందితో కూడిన ఎన్నికల సంఘ బృందం అక్టోబర్ 3 నుంచి 5 వరకు విస్తృత స్థాయిలో సమీక్షలు నిర్వహించనున్నది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నద్దం అవుతున్నది. ప్రస్తుతం ఓటరు జాబితా సవరణను చేపట్టింది. రేపటి (సెప్టెంబర్ 19) వరకు కొత్త ఓటర్ల నమోదు, సవరణకు అవకాశం కల్పించింది. అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు. అదే జాబితా ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్దతపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్షించనున్నారు. అక్టోబర్ 3 నుంచి ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘ ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో 17 మందితో కూడిన ఎన్నికల సంఘ బృందం అక్టోబర్ 3 నుంచి 5 వరకు విస్తృత స్థాయిలో సమీక్షలు నిర్వహించనున్నది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌కు వివరాలను పంపించారు. అక్టోబర్ 3న ఉదయం రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అవుతారు. సాయంత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
అక్టోబర్ 4న తెలంగాణ ఓటరు తుది జాబితాను విడుదల చేస్తారు. అదే రోజు జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు,ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారు. ఆ రోజంతా జిల్లాల సమీక్షలకే సీఈసీ రాజీవ్ కుమార్ బృందం కేటాయించింది. ఇక 5న ఓటర్ల చైతన్యం కోసం ఏర్పాటు చేసిన ప్రదర్శనలను వీక్షిస్తారు. అంతే కాకుండా యువ ఓటర్లను, రాష్ట్ర స్థాయి ఇన్‌ఫ్లూయెన్సర్లతో ముచ్చటిస్తారు.,
ఇక అదేరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌తో కేంద్ర ఎన్నికల బృందం సమావేశం అవుతుంది. తెలంగాణలో ఎన్నికల సన్నద్దత గురించి కీలక సమీక్ష నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం ఏ మేరకు సిద్ధంగా ఉన్నదో కూడా సీఈసీ రాజీవ్ కుమార్ తెలుసుకుంటారు. సీఈసీ వెంట కేంద్ర ఎన్నికల సంఘ కమిషనర్లు అందరూ తెలంగాణ రానుండటం గమనార్హం.