బీఆర్ఎస్ టు బీజేపీ.. ఒకే రోజు నలుగురు జంప్

హుజుర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, మహబూబాబాద్‌ మాజీ ఎంపీ సీతారాం నాయక్‌, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ గోడం నగేష్.. బీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరారు.

Advertisement
Update:2024-03-10 20:07 IST

తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు ఊహించినవే అయినా ఒకేరోజు నలుగురు జంప్ కావడంతో కలకలం రేగింది. ఆ నలుగురు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ హామీతోనే బీజేపీలో చేరారు. అందులో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కాగా, మరో ఇద్దరు మాజీ ఎంపీలు. హుజుర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, మహబూబాబాద్‌ మాజీ ఎంపీ సీతారాం నాయక్‌, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ గోడం నగేష్.. బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో వీరంతా కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.


వలసలపై గురి..

తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు చాలామందే ఉన్నా కూడా బీఆర్ఎస్ ని దెబ్బతీసే వ్యూహంతో వలసలు ప్రోత్సహిస్తోంది బీజేపీ. ఇటీవల ఒకరిద్దరు బీజేపీలోకి వెళ్లగా.. ఇప్పుడు ఒకేసారి నలుగురిని బీజేపీ లాగేసుకుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన కీలక నేతలు బీఆర్ఎస్ ని వదిలివేయడం ఆ పార్టీకి ఎదురుదెబ్బే అయినా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఈ వలసలను ఊహించింది. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటి తిరిగి బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తోంది బీఆర్ఎస్.

ఆ హామీతోనే..

జలగం వెంకట్రావుకు ఖమ్మం, శానంపూడి సైదిరెడ్డికి నల్గొండ, గోడం నగేష్ కు ఆదిలాబాద్, సీతారాం నాయక్‌కు మహబూబాబాద్ ఎంపీ టికెట్లు ఖాయం అయినట్టు సమాచారం. బీజేపీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌లో ఈ నాలుగు స్థానాలు లేవు. అంటే ఆ నాలుగు టికెట్లు ఈ నలుగురికే ఇవ్వబోతున్నారని స్పష్టమైంది. వలస నేతలతో బీజేపీ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News