నల్లచొక్కాలు, చేతులకు బేడీలతో బీఆర్‌ఎస్ నిరసన
లగచర్ల గిరిజన రైతులకు సంఘీభావంగా అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన
అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన చేపట్టారు. లగచర్ల రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసిస్తూ వారికి సంఘీభావంగా చేతులకు బేడీలు వేసుకొని నిరసన తెలిపారు. ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలు ధరించి నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. లాఠీ రాజ్యం లూటీ రాజ్యం... రైతులకు బేడీల సిగ్గు సిగ్గు అంటూ నినాదాలతో హోరెత్తించారు.పరిశ్రమల పేరుతో బలవంతపు భూసేకరణ, రైతుల అరెస్టులపై బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది.
తెలంగాణ అసెంబ్లీ ఉభయసభలో మంగళవారం మూడో రోజు కొనసాగనున్నాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో సభలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు రెండు సభల్లో సమాధానం ఇవ్వనున్నారు. అనంతరం సీఎం బీఏసీ నిర్ణయాలను సభలో ప్రవేశపెడుతారు. అనంతరం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏడో వార్షిక నివేదిక ప్రవేశపెడుతారు. శాసనసభలో స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, వర్సిటీల సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు 2024ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెడుతారు.