ఏప్రిల్ 27న బీఆర్ఎస్ తొలి ప్లీనరీ.! భారీగా నిర్వహించేందుకు కసరత్తు
దేశంలో బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్‌తోనే సాధ్యమని.. అవసరం అయితే బీజేపీని వ్యతిరేకించే ప్రాంతాయ పార్టీలను కూడా కలుపుకొని పోతామనే సందేశాన్ని కేసీఆర్ ప్లీనరీ వేదికగా ఇవ్వనున్నారు.
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన తర్వాత తొలి ప్లీనరీని ఏప్రిల్ 27న నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారా? ప్లీనరీ ద్వారా బీఆర్ఎస్ బలమేంటో దేశానికి చాటేందుకు సిద్ధపడుతున్నారా? బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే అని సందేశాన్ని ఇవ్వబోతున్నారా? అంటే ప్రస్తుతం పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అవుననే సమాధానమే వస్తోంది. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ తొలి ప్లీనరీని భారీగా నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్ వేదికగానే ఈ ప్లీనరీ కోసం ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తున్నది.
టీఆర్ఎస్ పార్టీ ప్రతీ ఏడాది ఏప్రిల్ 27న ప్లీనరీ నిర్వహిస్తోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో ప్రతీ ఏడాది అదే రోజు ప్లీనరీని నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు పార్టీ పేరు మారిపోవడంతో ప్లీనరీ ఉంటుందా లేదా అనే అనుమానాలు కలిగాయి. బీఆర్ఎస్‌కు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డిసెంబర్ 8 లేదా పార్టీని అధికారికంగా ప్రకటించిన డిసెంబర్ 9న ప్లీనరీ ఉంటుందనే వార్తలు వచ్చాయి. అయితే.. పార్టీ పేరు మాత్రమే మారిందని.. ఇప్పటికీ బీఆర్ఎస్ అంటే పాత టీఆర్ఎస్సే అని అధినేత కేసీఆర్ అంటున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయాల కోసమే పార్టీ పేరు మార్చినప్పుడు ప్లీనరీ డేట్ మార్చాల్సిన అవసరం లేదని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఏప్రిల్ 27నే ప్లీనరీ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ సారి బీఆర్ఎస్ పేరుతో ఎన్నికలను ఎదుర్కోబోతోంది. ఎన్నికలకు మరో కొన్ని నెలలే సమయం ఉన్న నేపథ్యంలో ప్లీనరీ ద్వారా సీఎం కేసీఆర్ కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ సారి కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా.. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అమలు చేయబోయే పథకాలను ప్రకటిస్తారని సమాచారం.
దేశంలో బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్‌తోనే సాధ్యమని.. అవసరం అయితే బీజేపీని వ్యతిరేకించే ప్రాంతాయ పార్టీలను కూడా కలుపుకొని పోతామనే సందేశాన్ని కేసీఆర్ ప్లీనరీ వేదికగా ఇవ్వనున్నారు. ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌లోనే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. దీనికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, బీహార్ డిప్యుటీ సీఎం తేజశ్వి యాదవ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, కేరళ సీఎం పినరయ్ విజయన్, ఇతర నాన్-బీజేపీ జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులను ప్రత్యేకంగా ఆహ్వానించే అవకాశం ఉంది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకం. అందుకే ప్లీనరీని ఘన విజయం చేస్తే.. కార్యకర్తల్లో కూడా ఉత్సాహం వస్తుందని పార్టీ భావిస్తోంది. గతంలో జరిగిన ప్లీనరీలు అన్నీ ఒక ఎత్తైతే.. ఈ సారి జరగబోయేది మరో ఎత్తని పార్టీ నాయకులు అంటున్నారు. సీఎం కేసీఆర్ భవిష్యత్ ఆలోచనలను వెల్లడించే వేదిక కాబోతుండటంతో పార్టీ ఈ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.