ఆ 40 నియోజకవర్గాలు.. మూడు పార్టీలు స్పెషల్ ఫోకస్
వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దీంతో కాంగ్రెస్ సైతం పాలమూరు జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. యాదృచ్చికంగా ఈ జిల్లా నుంచే పార్టీల ఫిరాయింపులు ఎక్కువగా ఉన్నాయి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పొలిటికల్ హీట్ పెరిగింది. తెలంగాణలో 119 నియోజకవర్గాలుండగా.. మూడు ప్రధాన పార్టీలు 40 నియోజకవర్గాలున్న దక్షిణ తెలంగాణ జిల్లాలపై స్పెషల్ ఫొకస్ పెట్టాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలపై పార్టీలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఈ మూడు జిల్లాల్లో ప్రధాన పార్టీల నేతలు విస్త్రృతంగా పర్యటిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ సైతం పాలమూరు జిల్లా నుంచి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించగా.. కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ సైతం ఇదే జిల్లాలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రెండు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ సైతం వనపర్తి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేశారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దీంతో కాంగ్రెస్ సైతం పాలమూరు జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. యాదృచ్చికంగా ఈ జిల్లా నుంచే పార్టీల ఫిరాయింపులు ఎక్కువగా ఉన్నాయి.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు 13 స్థానాలు గెలుచుకుంది బీఆర్ఎస్. కేవలం కొల్లాపూర్ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి గెలిచారు. తర్వాత ఆయన కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మహబూబ్‌నగర్‌లో హస్తం పార్టీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఈ స్థానంలో పట్టు ఉన్న జూపల్లి కృష్ణారావు ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి సైతం పరోక్షంగా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. బీజేపీలో సీనియర్ నేతలు డి.కె.అరుణ, జితేందర్ రెడ్డి ఈ జిల్లా నుంచే ఉన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ కంచుకోట అనే పేరు ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 9 స్థానాలు బీఆర్ఎస్, 3 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. తర్వాత నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్‌లో చేరడం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం, ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాలతో వచ్చిన బైపోల్‌లో ఓటమి పాలయ్యారు. ఇక హుజూర్‌నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్లమెంటుకు వెళ్లడంతో ఆ సీటు కూడా బీఆర్ఎస్ ఖాతాలో చేరింది. సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక దక్షిణ తెలంగాణలో మరో కీలకమైన జిల్లా రంగారెడ్డి. వివిధ రాజకీయ పరిణామాల కారణంగా 2018 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వెంటనే ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరిపోయారు. దీంతో రంగారెడ్డి జిల్లాలోనూ కాంగ్రెస్‌కు ప్రాతినిథ్యం లేకుండా పోయింది. దీంతో ఈసారి ఎలాగైనా జిల్లాలో ఎక్కువ స్థానాలు గెలవాలని పట్టుదలతో ఉంది. అందువల్లే ప్రస్తుతం రెండు సార్లు భారీ బహిరంగ సభలు నిర్వహించింది.