బీజేపీకి షాక్.. టికెట్ వద్దన్న అభ్యర్థి
బీజేపీనుంచి పోటీ అంటనే అభ్యర్థులు వెనక్కు తగ్గుతున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా పోటీలో లేరు. డీకే అరుణ వంటి వాటి ముందుగానే తాము బరిలో లేమని ప్రకటించారు. విజయశాంతి సహా ఇతర కీలక నేతలు తమకు అవకాశం దక్కకపోవడమే మంచిదని అనుకుంటున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో ఓవైపు టికెట్లకోసం అలకలు, గొడవలు, చివరకు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ దశలో అసలు తనకు టిక్కెట్టే వద్దంటూ ఓ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు వెనకడుగు వేయడం విశేషం. వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి అశ్వత్థామరెడ్డిని ఇటీవల బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన పేరు జాబితాలో కూడా ఉంది. ఈరోజు ఆయన నామినేషన్ వేయాల్సి ఉండగా.. తనకు టికెట్ వద్దని నిరాకరించారు. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన అధిష్టానానికి సమాచారమిచ్చారు. దీంతో కొత్త అభ్యర్థిని వెదికేందుకు బీజేపీ తలపట్టుకుంది.
ఆర్టీసీ కార్మికసంఘం నేతగా అశ్వత్థామరెడ్డికి గుర్తింపు ఉంది. రెండేళ్ల క్రితం ఆయన బీజేపీలో చేరారు. వనపర్తి నుంచి పోటీకి ఉత్సాహపడ్డారు. తీరా ఎన్నికల టైమ్ వచ్చింది, లిస్ట్ లు ప్రకటించారు, అందులో అశ్వత్థామరెడ్డి పేరు కూడా ఉంది. ఆయన కూడా నామినేషన్ కు ఏర్పాట్లు చేసుకున్నారు. ఏమైందో ఏమో చివరి నిమిషంలో వెనకడుగు వేశారు. పేరును ప్రకటించిన తర్వాత అశ్వత్థామ రెడ్డి వనపర్తి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు కారణాల వల్ల తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు అధిష్టానానికి ఆయన సమాచారం ఇచ్చారు. రాష్ట్రస్థాయిలో పార్టీ బాధ్యతల నిర్వహణ కోసం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. అశ్వత్థామరెడ్డి స్థానంలో వనపర్తి టికెట్ ను బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనుజ్ఞ రెడ్డికి ఇచ్చే అవకాశముంది.
ఎందుకిలా..?
బీజేపీనుంచి పోటీ అంటనే అభ్యర్థులు వెనక్కు తగ్గుతున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా పోటీలో లేరు. డీకే అరుణ వంటి వాటి ముందుగానే తాము బరిలో లేమని ప్రకటించారు. విజయశాంతి సహా ఇతర కీలక నేతలు తమకు అవకాశం దక్కకపోవడమే మంచిదని అనుకుంటున్నారు. సరిగ్గా ఎన్నికల టైమ్ లో రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి వంటి నాయకులు పార్టీకి హ్యాండిచ్చారు. ఈ దశలో బీజేపీ నుంచి పోటీ చేయడం కరెక్టేనా, కాదా అని చాలామంది బేరీజు వేసుకుంటున్నారు. అలా పరిస్థితులు అంచనా వేసి అశ్వత్థామరెడ్డి వెనకడుగు వేశారని తెలుస్తోంది. అయితే టికెట్ కేటాయించినా అభ్యర్థి వెనకడుగు వేయడంతో ఆయన్ను ఎంపిక చేసిన అధిష్టానం చివరకు ఫూల్ అయిందని సెటైర్లు వినిపిస్తున్నాయి.