విచారణకు హాజరవుతా.. బండి కవరింగ్ కష్టాలు

ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరి అయిన బండి సంజయ్ ఎట్టకేలకు నోరు విప్పారు. నోటీసులు వస్తే విచారణకు హాజరవుతానని ప్రకటించారు.

Advertisement
Update:2023-03-11 21:11 IST

ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నోరు జారారు. చీప్ గా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా మహిళా సంఘాలు పార్టీలకతీతంగా స్పందించాయి. బండికి నోటినిండా గడ్డి పెట్టాయి. బీఆర్ఎస్ శ్రేణులు ఊరూ వాడా నిరసనలు తెలిపారు. బండి శవయాత్రలు చేపట్టారు, దిష్టిబొమ్మలు తగలబెట్టారు. రాజ్ భవన్ ముందు ధర్నా చేపట్టారు. నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అటు మహిళా కమిషన్ కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయింది. విచారణ జరపాలంటూ డీజీపీని ఆదేశించింది. ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరి అయిన బండి సంజయ్ ఎట్టకేలకు నోరు విప్పారు. నోటీసులు వస్తే విచారణకు హాజరవుతానని ప్రకటించారు.

మహిళా కమిషన్ ఆగ్రహం..

ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల గౌరవాన్ని కించపరిచేలా సంజయ్‌ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడింది. సంజయ్‌ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కమిషన్‌, విచారణ జరపాలని డీజీపీని ఆదేశించింది. బండికి నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పింది. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలిస్తున్నట్టు తెలిపింది.

మహిళా కమిషన్ నోటీసులు తనకింకా అందలేదని అన్నారు బండి సంజయ్. ఒకవేళ నోటీసులు వస్తే, తప్పకుండా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరవుతానని ప్రకటించారు. మొత్తమ్మీద ఈ వ్యవహారం తెలంగాణలో కలకలం సృష్టించింది. బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలపై మహిళాలోకం మండిపడింది.

Tags:    
Advertisement

Similar News