కరీంనగర్ కాస్ట్ లీ గురూ..! ఓటుకు రూ.10వేలు ప్లస్ సెల్ ఫోన్
కరీంనగర్ లో గంగుల గెలిస్తే బొట్టు పెట్టుకుని, కంకణం కట్టుకుని నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేదన్నారు బండి సంజయ్. హిందువుల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు.
ములుగు నియోజకవర్గంలో తనను ఓడించేందుకు వైరి వర్గం ఓటుకు రూ.5వేలు పంచుతోందంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించిన విషయం తెలిసిందే. కరీంనగర్ లో తనను ఓడించేందుకు ఓటుకు రూ.10వేలు, యువతకు సెల్ ఫోన్ ఇస్తున్నారంటూ బండి సంజయ్ ఇపుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో ప్రచారం చేపట్టిన బండి.. తన ప్రత్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. భూకబ్జాలతో గంగుల కోట్ల రూపాయలు సంపాదించారని, ఆ డబ్బులో కొంత ఎలక్షన్ లో ఖర్చు చేయబోతున్నారని అన్నారు. ఓటుకు రూ.10వేలు, యువతకు పంచి పెట్టేందుకు 5వేల సెల్ ఫోన్లు తెప్పించారని ఆరోపించారు బండి.
గంగులకు ఓటమి ఖాయమని కేసీఆర్ కు ఎప్పుడో తెలుసన్నారు బండి సంజయ్. అందుకే చాలా రోజులు ఆయనకు బీ-ఫాం ఇవ్వలేదని చెప్పారు. కరీంనగర్ మేయర్ పదవి ఎంఐఎంకు ఇస్తామనే ఒప్పందం మీద చివరకు ఆ సీటు గంగులకు ఇచ్చారని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో గంగుల చేతిలో ఓడిపోయిన బండి సంజయ్, ఈసారి ఎలాగైనా విజయం సాధిస్తానంటున్నారు.
హిందువుల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
కరీంనగర్ లో గంగుల గెలిస్తే బొట్టు పెట్టుకుని, కంకణం కట్టుకుని నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేదన్నారు బండి సంజయ్. హిందువుల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీల్చి, ఆ పార్టీకి మేలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీ, రోడ్ల విస్తరణ పనులు, స్మార్ట్ సిటీ నిధులన్నీ తాను కేంద్రం నుంచి తెచ్చానన్నారు బండి. కష్టపడి తాను నిధులు తీసుకొస్తే.. గంగుల ఫోటోలు పెట్టుకుని ఊరేగుతున్నారని అన్నారు. మొత్తమ్మీద కరీనంగర్ లో బీజేపీకి వ్యవహారం తేడాకొట్టేలా ఉందని తెలిసే, ఓటుకు నోటు, సెల్ ఫోన్ అంటూ బండి ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.