బాలాపూర్ ఫస్ట్.. మైహోం నెక్స్ట్.. రికార్డ్ స్థాయిలో లడ్డూ వేలం..

1994 నుంచి బాలాపూర్‌ లో గణేష్ లడ్డూ వేలంపాట కొనసాగుతోంది. తొలుత రూ.450తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ ఆ తర్వాతి ఏడాది 4500 రూపాయలకు చేరింది. 2002లో తొలిసారి వేలంలో లడ్డూ ధర లక్షరూపాయలు పలికింది.

Advertisement
Update:2022-09-09 13:06 IST

హైదరాబాద్ లో నిమజ్జనోత్సవం అంటే.. అందరి దృష్టీ ముందు బాలాపూర్ లడ్డూ వేలంపై ఉంటుంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూసినట్టే ఈ ఏడాది కూడా లడ్డూ వేలంపాట అమాంతం పెరిగిపోయింది. ఏకంగా రూ.24.60 లక్షలకు చేరింది. బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డూని రూ.24.60లక్షలకు దక్కించుకున్నారు. మొత్తం 9మంది మధ్య హోరాహోరీగా వేలంపాట జరిగింది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, స్థానిక నేతలు కూడా ఈ వేలంపాటను ఆసక్తిగా తిలకించారు.

బాలాపూర్ చరిత్ర ఇదీ..

1994 నుంచి బాలాపూర్‌లో గణేష్ లడ్డూ వేలంపాట కొనసాగుతోంది. తొలుత రూ.450తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ ఆ తర్వాతి ఏడాది 4500 రూపాయలకు చేరింది. 2002లో తొలిసారి వేలంలో లడ్డూ ధర లక్షరూపాయలు పలికింది. ఆ తర్వాత వేలంలో లడ్డూ రేటు మరింతగా పెరిగింది. 2020లో కరోనా కారణంగా వేలం పాట జరగలేదు. 2021లో రూ.18.90 లక్షలు పలికింది. తాజాగా ఆ రికార్డ్ కూడా బ్రేక్ అయింది. ఇప్పుడు 24లక్షల 60వేల రూపాయలకు చేరింది బాలాపూర్ లడ్డూ.

మై హోం లడ్డూ రూ.20.5 లక్షలు..

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ లోని మైహోం భూజ గేటెడ్‌ కమ్యూనిటీలో వినాయక లడ్డూ కూడా ఈసారి రికార్డు ధర పలికింది. మోతూరి సత్తిబాబు.. రూ.20.50 లక్షలకు ఇక్కడ లడ్డూని వేలంలో చేజిక్కించుకున్నారు. ఒకరకంగా ఇది గతేడాది బాలాపూర్ లడ్డూ వేలం కంటే అధికం. దీంతో బాలాపూర్ లడ్డూ ధర కూడా అమాంతం పెరిగింది. మైహోం లడ్డూని అధిగమించింది. తెలంగాణలో మిగతా జిల్లాల విషయానికొస్తే.. మెదక్‌ జిల్లా అమీన్‌ పూర్‌ బీరంగూడ గుట్ట కమాన్‌ చౌరస్తాలో వినాయక లడ్డూను రామిరెడ్డి అనే వ్యక్తి రూ.10.05 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్నారు.

ఖైరతాబాద్ లో మాత్రం వినాయకుడి వద్ద పెట్టిన లడ్డూని వేలం వేయరు. నిమజ్జనం రోజు ఆ లడ్డూ ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారు. ఖైరతాబాద్ వినాయకుడికి లడ్డూని సమర్పించేందుకు ఏపీకి చెందిన స్వీట్ షాపుల యజమానులు పోటీ పడుతుంటారు. అత్యంత భారీ లడ్డుని ఇక్కడికి తెచ్చి స్వామివారికి సమర్పిస్తుంటారు.

Tags:    
Advertisement

Similar News