బీసీ సీఎం సరే..! నాకు జరిగిన అవమానం సంగతేంటి..?
బీజేపీలో తనకు చాలా అవమానాలు జరిగాయని అంటున్నారు మాజీ మంత్రి బాబూ మోహన్. ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే తాను ఇప్పుడు బయటకొచ్చానని చెప్పుకొచ్చారు.
అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ఘనంగా ప్రకటించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అంత ఆర్భాటంగా ప్రకటించినా బీసీల నుంచి, కనీసం బీజేపీలోని బీసీ నేతలనుంచి కూడా పెద్దగా స్పందన లేదు. ఒకరిద్దరు స్పందించినా ఏదో మొహమాటం కోసం మాట్లాడుతున్నారే కానీ.. బీజేపీ ఆఫర్ లో నిజాయితీ లేదని అందరికీ తెలుసు. ఈ క్రమంలో బీజేపీలో దళిత నేత బాబూ మోహన్ తన ఆవేదన బయటపెట్టారు. పార్టీలో తనకు అవమానం జరిగిందన్నారు.
నా ఫోన్ లిఫ్ట్ చేయరా..?
బీజేపీలో తనకు చాలా అవమానాలు జరిగాయని అంటున్నారు మాజీ మంత్రి బాబూ మోహన్. ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే తాను ఇప్పుడు బయటకొచ్చానని చెప్పుకొచ్చారు. బీజేపీ లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో రాష్ట్ర నాయకత్వానికి ఫోన్ చేశానని కనీసం తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ తన ఫోన్ కి ఆన్సర్ చేయలేదని వాపోయారు. కావాలనే తనను పార్టీ దూరం పెట్టిందని ఇకపై ఈ అవమానాలు భరించలేనన్నారు. పార్టీ కోరుకుంటే రాజీనామాసైతం చేస్తానన్నారు బాబూ మోహన్.
కుటుంబంలో చిచ్చుపెడతారా..?
తనకు టికెట్ ఇవ్వకపోగా తన కుటుంబంలో సైతం బీజేపీ చిచ్చు పెట్టిందన్నారు బాబూ మోహన్. "అసెంబ్లీ ఎన్నికల్లో నా కుమారుడికి టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం చేసి.. మా మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. అర్హులకే టికెట్ ఇవ్వాలని బీజేపీ పెద్దలను కోరుతున్నా. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా. ఎన్నికలు, పార్టీ ప్రచారాలకు దూరంగా ఉంటా. అధిష్టానం నిర్ణయం మేరకు పార్టీకి కూడా రాజీనామా చేస్తా." అని అన్నారు బాబూ మోహన్.