రఘునందన్ కి తోట చంద్రశేఖర్ స్ట్రాంగ్ కౌంటర్..

రఘునందన్ ఆరోపణలు నిజమైతే ఆ సర్వే నెంబర్‌ లోని భూమిలో 90 శాతం మీరే తీసుకోండి అన్నారు చంద్రశేఖర్. మిగిలిన 10 శాతం తనకిస్తే చాలన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు, నిరాధార ఆరోపణలు మానుకోవాలని రఘునందన్ ని హెచ్చరించారు.

Advertisement
Update:2023-01-18 12:39 IST

తోట చంద్రశేఖర్ రావుని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా చేసిన తర్వాత, ఆయనపై ఎక్కడలేని ఆరోపణలు చేస్తున్నారు బీజేపీ నేతలు. ఆయనను టార్గెట్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలకు ఘాటుగా బదులిచ్చారు తోట చంద్రశేఖర్. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

4వేల కోట్ల విలువైన మియాపూర్ భూములను సీఎం కేసీఆర్, తోట చంద్రశేఖర్ కి ధారాదత్తం చేశారని, అందుకే ఏపీనుంచి బీఆర్ఎస్ కి నిధులు వస్తున్నాయని చెప్పారు రఘునందన్ రావు. రఘునందన్ ఆరోపణలు నిజమైతే ఆ సర్వే నెంబర్‌ లోని భూమిలో 90 శాతం మీరే తీసుకోండి అన్నారు చంద్రశేఖర్. మిగిలిన 10 శాతం తనకిస్తే చాలన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు, నిరాధార ఆరోపణలు మానుకోవాలని రఘునందన్ ని హెచ్చరించారు.

కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ దేశ భవిష్యత్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు చంద్రశేఖర్. తెలంగాణ మోడల్‌ ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీని స్థాపించారన్నారు. తెలంగాణ ప్రగతిని ఏపీతో పాటు దేశానికి పరిచయం చేస్తామన్నారు. త్వరలో విశాఖలో జరిగే బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News