నాపై పెట్టింది అక్రమ కేసు, రాజకీయ ప్రేరేపిత కేసు

ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో అరపైసా అవినీతి కూడా జరగలేదన్న కేటీఆర్‌

Advertisement
Update:2025-01-07 20:48 IST

 అధికారాన్ని అడ్డుపెట్టుకొని నాపై అక్రమ కేసులు పెట్టారని, తనపై పెట్టింది కక్ష సాధింపు కేసు అని తెలిసినా ఏసీబీ విచారణకు హాజరయ్యానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. నందినగర్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనబడుతుంది. నాపై పెట్టింది అక్రమ కేసు, రాజకీయ ప్రేరేపిత కేసు అన్నారు. అవినీతిపరులకు అంతా అవినీతిగానే కనిపిస్తుందన్నారు. ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో అరపైసా అవినీతి కూడా జరగలేదన్నారు. తెలంగాణ ఇమేజ్‌ను అకాశమంతా ఎత్తుకు తీసుకువెళ్లడానికి ఫార్ములా రేస్‌ నిర్ణయం తీసుకున్నాం. అధికారాన్ని అడ్డంపెట్టుకుని నాపై అక్రమ కేసు పెట్టారు. విచారణకు లాయర్లతో రావొద్దని చెబుతున్నారు. హైకోర్టు అనుమతిస్తే మా న్యాయవాదులతో కలిసి ఏసీబీ విచారణకు హాజరవుతానని కేటీఆర్‌ చెప్పారు. దుర్మార్గుల నుంచి చట్టపరంగా రక్షణ కోరుతున్నాను. నా హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తించారు. సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. పట్నం నరేందర్‌రెడ్డి ఇవ్వని స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు బుకాయించారు. అందుకే న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. నేను ఏ తప్పూ చేయలేదన్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు.

ఎల్లుండి కూడా లాయర్లతో అనుమతిస్తే విచారణకు వెళ్తాను. ఈ నెల 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతాను. ఏదో జరిగిందని కొందరు శునకానందం పొందుతున్నారు. విచారణ కొనసాగించాలని చెప్పిందే తప్ప కోర్టు నాకు శిక్ష వేయలేదు. నేను నేరం చేసినట్లు గాని, తప్పు చేసినట్లు గాని కోర్టు చెప్పలేదు. ఏం జరగబోతున్నదో కొందరు మంత్రులు ముందే చెబుతున్నారు. విచారణ సచివాలయంలో జరగదు.. మంత్రుల పేషీలో జరగదు.విచారణ ఎప్పుడైనా న్యాయస్థానాల్లోనే జరుగుతుందన్నారు. గతంలో మీకు ఇలాంటి అనుభవాలే ఎదురైతే కోర్టుకే వెళ్లారని కేటీఆర్‌ గుర్తు చేశారు. మాపై కేసులు ఇది ఆరంభం మాత్రమే. రాబోయే నాలుగేళ్లలో ఇంకా చాలా పెడుతారు. నాకు ఉన్న రాజ్యాంగపరమైన హక్కులు వినియోగించుకుంటాను. చట్టాన్ని గౌరవించే పౌరుడిలా విచారణకు హాజరయ్యాను. భారత న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉన్నది. చివరికి న్యాయమే గెలుస్తుందన్నారు.


Tags:    
Advertisement

Similar News