వింబుల్డన్ క్లబ్‌లోనికి వెళ్లకుండా రోజర్ ఫెదరర్‌ను అడ్డుకున్నది ఎవరు?
ట్రెవర్ నోవా నిర్వహించే 'ది డైలీ షో'లో పాల్గొన్న ఫెదరర్ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు.
టెన్నిస్ లెెజెండ్ రోజర్ ఫెదరర్‌ను గ్రాస్ కోర్ట్ ఆల్ టైం గ్రేట్‌గా పిలుస్తారు. వింబుల్డన్‌ను రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు గెలిచిన ఈ ఛాంపియన్‌కు లండన్‌లోని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ (వింబుల్డన్ క్లబ్) వద్ద అవమానం జరిగిందా? ఫెదరర్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారా? అంటే.. దానికి సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను స్వయంగా ఆయనే వెల్లడించారు. ట్రెవర్ నోవా నిర్వహించే 'ది డైలీ షో'లో పాల్గొన్న ఫెదరర్ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు.
'నా స్పాన్సర్ యూనిక్లో కోసం రెండు వారాల క్రితం టోక్యో వెళ్లాను. తిరిగి వచ్చే సమయంలో లండన్‌లో దిగాను. నాకు డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉండటంతో వింబుల్డన్ క్లబ్ వాళ్లకు సమాచారం ఇవ్వలేదు. సాధారణంగా టోర్నీ జరిగే సమయంలో తప్ప మిగిలిన రోజుల్లో నేను వింబుల్డన్ స్టేడియంలకు రాను. అయితే, ఆ రోజు డాక్టర్ అపాయింట్‌మెంట్ త్వరగా ముగిసింది. నా మోకాలుకు సంబంధించిన మెడిసిన్స్ రాయించుకున్నాను. ఆ తర్వాత మా ఊరికి (స్విట్జర్లాండ్) వెళ్లే ఫ్లైట్‌కి ఇంకా రెండు గంటల సమయం ఉంది. దీంతో టీ తాగుదామని నేను, నా కోచ్ కలిసి కార్‌లో వింబుల్డన్ క్లబ్‌కు వెళ్లాము' అని అన్నారు.
అక్కడికి వెళ్లాక నాకు ఏ గేట్ నుంచి లోపలికి వెళ్లాలో అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఆటగాడిగా వచ్చినప్పుడు నాకు సెపరేట్‌గా ఎంట్రీ ఉంటుంది. కానీ ఇప్పుడు మామూలుగా వచ్చాను. అందుకే అక్కడ ఉన్న మహిళా సెక్యూరిటీని అడిగి వస్తానని నా కోచ్‌తో చెప్పి కారు దిగానని అన్నారు. ఫెదరర్ ఆ గార్డు వద్దకు వెళ్లి.. నేను క్లబ్ లోకి వెళ్లాలి గేట్ ఎక్కడుందో చెప్పగలరా అని అన్నారు. దానికి మహిళా గార్డు మెంబర్‌షిప్ కార్డు ఉందా అని ప్రశ్నించింది. దాంతో ఫెదరర్ ఒక్క సారిగా షాక్‌కు గురయ్యానని.. అలాంటి అనుభవం నాకు ఎప్పుడూ రాలేదని చెప్పాడు.
వాస్తవానికి వింబుల్డన్ టైటిల్ గెలిస్తే ఆటోమెటిక్‌గా మెంబర్ అవుతారు. అయితే నా దగ్గర ఆ కార్డు లేదు. ఇంట్లో ఎక్కడో ఉండి ఉంటుంది. అందుకే ఆ గార్డును కన్విన్స్ చేయాలని అనుకున్నాను. 'నిజం చెప్పాలంటే మెంబర్‌షిప్ కార్డు ఉండాలని నాకు తెలియదు. నేను ప్రయాణంలో బ్రేక్ తీసుకొని వచ్చాను. నాకు దాని మీద అవగాహన లేదు. లోపలికి ఎలా వెళ్లాలో చెప్పండి' అని సెక్యూరిటీని ఫెదరర్ అడిగారు.
కానీ ఆమె ఏ మాత్రం పట్టించుకోకుండా.. మెంబర్ అయితేనే లోపలికి ఎంట్రీ ఉంటుందని తెగేసి చెప్పారు. 'నేను ఇక్కడికి ఒక ఆటగాడి వస్తుంటాను. అప్పుడు నా ఆట చూడటానికి వేలాది మంది ప్రజలు వస్తారు. అప్పడు నేను వేరే దారిలో లోపలికి వెళ్తాను. ఇప్పుడు టోర్నమెంట్ జరగడం లేదు కాబట్టి ఇటువైపు వచ్చాను. లోపలికి ఎలా వెళ్లాలో తెలియడం లేదు. మీకో విషయం చెప్పాలా? నేను ఈ టోర్నీని ఎనిమిది సార్లె గెలిచాను. ప్లీజ్ నన్ను నమ్మండి. నేను మెంబర్‌నే. లోపలికి ఎలా వెళ్లాలి' అని సెక్యూరిటీని పదే పదే బతిమిలాడారు. అయినా సరే ఆ గార్డు మాత్రం మెంబర్‌షిప్ కార్డు ఉంటేనే వెళ్లనిస్తామని తేల్చి చెప్పింది.
దీంతో ఫెదరర్ కారులో ఎక్కి.. వెనుక వైపు ఉన్న మరో గేట్ వైపుకు వెళ్లారు. అక్కడైనా తనను గర్తు పడతారో లేదో అనే అనుమానం కలిగింది. అయితే కారు దిగగానే.. ఒక వ్యక్తి వచ్చి.. హాయ్ ఫెదరర్.. మీతో ఒక సెల్ఫీ దిగొచ్చా అని అడిగాడు. అప్పుడు.. హమ్మయ్యా నన్ను గుర్తు పట్టే మనుషులు ఉన్నారని అనుకున్నానంటూ నవ్వేశారు. అంతే కాకుండా అక్కడే ఉన్న సెక్యూరిటీ ఫెదరర్‌ను స్వయంగా క్లబ్‌లోకి తీసుకొని వెళ్లారు. కొంత సేపు అక్కడే గడిపిన ఫెదరర్.. తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.
ట్రెవర్ నోవా షోలో తన అనుభవాన్ని పంచుకున్న ఫెదరర్.. తనకు ఆ మహిళా సెక్యూరిటీ గార్డుపై ఏ మాత్రం కోపం రాలేదని, ఎందుకంటే ఆమె తన డ్యూటీ తాను చేసిందని చెప్పుకొచ్చారు. ఈ షోకు సంబంధించిన క్లిప్‌ను వింబుల్డన్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఫెదరర్.. మీరు ఎప్పుడైనా వింబుల్డన్‌కు రావొచ్చు అని రాసుకొచ్చింది. మొత్తానికి ఫెదరర్ తనకు ఎదురైన విచిత్ర అనుభవాన్ని చాలా లైట్‌గా తీసుకోవడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.