భారత వస్తాదులకు ఒలింపిక్ సంఘం దన్ను!
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న భారత వస్తాదులకు దన్నుగా నిలవాలని భారత ఒలింపిక్స్ సంఘం నిర్ణయించింది.
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న భారత వస్తాదులకు దన్నుగా నిలవాలని భారత ఒలింపిక్స్ సంఘం నిర్ణయించింది.
గత కొద్దివారాలుగా నిరసన దీక్షలో ఉన్న భారత వస్తాదులు ఆసియాక్రీడల అర్హత పోటీలలో పాల్గొనటానికి తనవంతు సహకారం అందించాలని జాతీయ ఒలింపిక్స్ సమాఖ్య నిర్ణయించింది.
దీక్షలతో సాధనకు దూరమైన వస్తాదులు...
తమపై జరిగిన లైంగిక వేధింపులకు నిరసనగా గత కొద్దివారాలుగా నిరసనదీక్ష పాటిస్తున్న కారణంగా వినేశ్ పోగట్, సాక్షీ మాలిక్, భజరంగ పూనియా లాంటి పలువురు భారత వస్తాదులు అనుదినం చేసే కుస్తీ సాధనకు దూరమయ్యారు. త్వరలో జరిగే ఆసియాక్రీడల అర్హత పోటీలలో పాల్గొనటం కూడా ప్రశ్నార్థకంగా మారింది.
చైనా వేదికగా జరిగే 2023 ఆసియాక్రీడల కుస్తీలో భారత వస్తాదులు పాల్గొనాలంటే..క్వాలిఫైయింగ్ టోర్నీలలో పాల్గొనాల్సి ఉంది.
క్వాలిఫైయింగ్ టోర్నీలలో పాల్గొనాలంటే వస్తాదులకు తగిన ప్రాక్టీసు ఉండితీరాలి. అయితే..జాతీయ కుస్తీ సంఘం అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ కు వ్యతిరేకంగా
జనవరి 18 నుంచి దీక్ష నిర్వహిస్తున్న కారణంగా పలువురు ప్రముఖ వస్తాదులు ప్రాక్టీసుకు దూరమయ్యారు.
భారత వస్తాదులకు ప్రత్యేక అనుమతి..
ఆసియాక్రీడల కుస్తీ అర్హత గడువును భారత వస్తాదులకోసం పొడిగించాలని కోరుతూ ఆసియా క్రీడల మండలికి భారత ఒలింపిక్స్ సంఘం ఓ విజ్ఞాపన పత్రాన్ని అందచేసింది.
ప్రస్తుతం నిరసన దీక్షలో ఉన్న వస్తాదులు ఇక జోరుగా తమ సాధన కొనసాగించడానికి వీలుగా..అర్హత పోటీలను జూన్ 30 నుంచి ఆగస్టు 30 లోపుగా నిర్వహించాలని కోరుతూ ఆసియా ఒలింపిక్ మండలి అధ్యక్షుడు రణధీర్ సింగ్ కు భారత ఒలింపిక్స్ సంఘం ఓ లేఖను అందచేసింది. భారత వస్తాదులకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలంటూ కోరింది.
ఆసియా క్రీడల మండలి ఈ విజ్ఞప్తిని స్వీకరిస్తే..భజరంగ్ పూనియా, వినేశ్ పోగట్, సాక్షి మాలిక్, సత్యవార్త్ కడియన్, సంగీత పోగట్, జితేంద్ర కుమార్ లాంటి మేటివస్తాదులకు తగిన సాధనతో అర్హత పోటీలలో పాల్గొనే అవకాశం దక్కుతుంది.
భజరంగ్ పూనియా, వినేశ్ పోగట్, సాక్షి మాలిక్ తమతమ విభాగాలలో భారత్ కు ఏదో ఒక పతకం సాధించిపెట్టే సత్తా ఉన్న వస్తాదులుగా గుర్తింపు తెచ్చుకొన్నారు.
19వ ఆసియాక్రీడలు చైనాలోని జిజియాంగ్ రాష్ర్ట్రం లోని గాంగ్డు వేదికగా సెప్టెంబర్ 10 నుంచి 25 వరకూ నిర్వహిస్తారు. గతేడాది జరగాల్సిన ఈ క్రీడలను కరోనా కారణంగా 2023కు వాయిదా వేశారు.
ఆసియా క్రీడలలో భారత్ అత్యధిక పతకాలు సాధించే కుస్తీ ప్రముఖంగా ఉంది.