టీ-20 డకౌట్లలో టాప్ రోహిత్ శర్మ!
భారత కెప్టెన్ కమ్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ పేరుతో ఓ చెత్త రికార్డు నమోదయ్యింది. దక్షిణాఫ్రికాతో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ లో రెండుసార్లు రోహిత్ డకౌట్లుగా అవుటయ్యాడు.
భారత కెప్టెన్ కమ్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ పేరుతో ఓ చెత్త రికార్డు నమోదయ్యింది. దక్షిణాఫ్రికాతో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ లో రెండుసార్లు రోహిత్ డకౌట్లుగా అవుటయ్యాడు. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ లో అత్యధికసార్లు డకౌట్లుగా వెనుదిరిగి కెప్టెన్ గా మిగిలాడు...
రోహిత్ శర..వైట్ బాల్ క్రికెట్లో అత్యంత విజయవంతమైన ఓపెనర్. వన్డే, టీ-20 ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు, డబుల్ సెంచరీలు సాధించిన ఒకే ఒక్కడు. మ్యాచ్ లు, సిక్సర్లు, టైటిల్ విజయాలలోనూ రోహిత్ పలు అసాధారణ రికార్డులు నెలకొల్పాడు. ప్రస్తుత 2022 సీజన్ మొదటి 10 మాసాలకాలంలోనే భారత్ కు అత్యధిక టీ-20 మ్యాచ్ విజయాలతో పాటు .సిరీస్ విజయాలు అందించిన మొనగాడు రోహిత్ మాత్రమే.
పలు గొప్పగొప్ప రికార్డులతో పాటు చెత్తరికార్డులు సైతం మూటకట్టుకొన్న ఆటగాడి ఘనత రోహిత్ శర్మకే దక్కుతుంది.
క్యాలెండర్ ఇయర్ లో డకౌట్ల రికార్డు..
దక్షిణాఫ్రికాతో ముగిసిన మ్యూడుమ్యాచ్ టీ-20 సిరీస్ లోని మొదటి ( తిరువనంతపురం ), ఆఖరి ( ఇండోర్ ) మ్యాచ్ ల్లో రోహిత్ శర్మ డకౌట్ గా వెనుదిరిగాడు. రెండుకు రెండుసార్లు ఫాస్ట్ బౌలర్ కిర్గిసో రబడా బౌలింగ్ లో రోహిత్ దొరికిపోయాడు. ఈ క్రమంలో 2022 క్యాలెండర్ ఇయర్ లో అత్యధికంగా మూడుసార్లు డకౌటైన కెప్టెన్ గా రోహిత్ ఓ చెత్తరికార్డును మూటకట్టుకోవాల్సి వచ్చింది.
టీ-20ల్లో 10 డకౌట్ల రోహిత్...
టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అత్యధికంగా 10సార్లు డకౌటైన భారత క్రికెటర్ రోహిత్ శర్మ మాత్రమే. ప్రస్తుత సీజన్లో భాగంగా విండీస్ తో జరిగిన మ్యాచ్ లో తొలిసారిగా డకౌటైన రోహిత్..దక్షిణాఫ్రికాతో సిరీస్ లో రెండుసార్లు అవుటయ్యాడు.
రోహిత్ తర్వాత...వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఐదుసార్లు, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ 4సార్లు డకౌట్లయ్యారు.
ఐపీఎల్ లో సైతం...
ఐపీఎల్ చరిత్రలో సైతం అత్యధిక డకౌట్ల రికార్డు రోహిత్ శర్మ పేరుతోనే ఉంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ కమ్ ఓపెనర్ గా రోహిత్ ఇప్పటికే 13సార్లు డకౌటైన బ్యాటర్ గా నిలిచాడు.హర్భజన్ సింగ్ 13సార్లు, పియూష్ చావ్లా,మన్ దీప్ సింగ్, అంబటి రాయుడు, మనీశ్ పాండే, గౌతం గంభీర్, అజింక్యా రహానే 12సార్లు డకౌట్లుగా అవుటైన బ్యాటర్లుగా ఉన్నారు.
సింగిల్ డిజిట్ స్కోర్లలోనూ రికార్డు..
డకౌట్లలో మాత్రమే కాదు...సింగిల్ డిజిట్ స్కోర్లకే అత్యధికసార్లు అవుటైన ఆటగాడిగా రోహిత్ శర్మ మరో చెత్త రికార్డును మూటకట్టుకొన్నాడు. టీ-20 చరిత్రలోనే అత్యధికంగా 43సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకు రోహిత్ అవుట్ కాగా...ఆ తర్వాతి స్థానంలో కెవిన్ ఓ బ్రియన్ ( 42 ), ముష్ ఫికుర్ రహీం ( 40 ), మహ్మద్ నబీ ( 39 ), షాహీద్ అఫ్రిదీ ( 37 ) ఉన్నారు.
కాయలు కాసే చెట్లకే రాళ్లదెబ్బలు అన్నట్లుగా..అంతర్జాతీయ టీ-20 క్రికెట్లో అత్యధిక పరుగులు, సెంచరీలు , రికార్డులు సాధించిన ఆటగాళ్లే..అత్యధిక డకౌట్లు, సింగిల్ డిజిట్ స్కోర్ల రికార్డులనూ తమ పేర్లతో జత చేసుకోడం క్రికెట్ ఆటలోని గొప్పతనానికి నిదర్శనం.