భారత్‌కు ఫాలో ఆన్ గండం తప్పింది
90 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 300/7
మెల్‌బోర్న్ టెస్టులోనూ భారత్ ఫాలో ఆన్ గండం తప్పించుకున్నది. నితీశ్‌కుమార్‌రెడ్డి టెస్ట్ కెరీర్‌లో మొదటి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో పుష్ప సినిమాలో 'తగ్గేదేలే' అంటూ మేనరిజంతో సంబరాలు చేసుకున్నాడు. అతనితోపాటు వాషింగ్టన్ సుందర్ కీలక రన్స్ చేశాడు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నిర్మించారు. భారత్ స్కోర్ 275 రన్స్ మార్క్ తాకగానే ఫాలో ఆన్ తప్పింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474 రన్స్ చేసిన విషయం విదితమే.
ఓవర్‌నైట్ 164/5 స్కోరుతో మూడోరోజు ఆటను ప్రారంభించిన భారత్ ఇన్నింగ్స్ నిలకడగానే సాగింది. ఆరో వికెట్‌కు రవీంద్ర జడేజా (17), రిషబ్ పంత్ (28) వేగంగా 48 పరుగులు జోడించారు. క్రీజులో పాతుకుపోవడంతో పాటు దూకుడుగా ఆడుతుండటంతో ఇబ్బంది ఏమీ లేదనిపించింది. కానీ తనదైన ర్యాంప్ షాట్లతో అలరించే రిషభ్ పంత్ ఆసీస్ ప్లాన్‌కు దొరికిపోయాడు. థర్డ్‌మ్యాన్ ఫీల్డర్‌ను పెట్టి ఆతిథ్య జట్టు ఫలితం రాబట్టింది. బోలాండ్ వేసిన బంతిని ర్యాంప్ చేయబోయి లైయన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
పంత్ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నితీశ్ కుమార్ రెడ్డి మరోసారి అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. బౌండరీలో కొడుతూ స్కోరు బోర్డును పరుగులుపెట్టించాడు. క్రీజులో నిలదొక్కుకున్నాడనుకున్న జడేజాను లైయన్ ఎల్బీ చేశాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో జడ్డూ డీఆర్‌ఎస్ తీసుకున్నా ఉపయోగడం లేకపోయింది. అంపైర్స్ కాల్ నిర్ణయం రావడంతో జడేజా నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత నితీశ్‌తో సుందర్ జత కలిశాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ మరో వికెట్ పడకుండా తొలి సెషన్ ముగించారు. 90 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 300/7 .టీమిండియా ఇంకా 174 రన్స్ వెనుకబడి ఉన్నది. నితీశ్ 69*, సుందర్ 34*రన్స్ తో క్రీజులో ఉన్నారు.