అక్షర్, రోహిత్ షో..భారత్ భలే గెలుపు!

నాగపూర్ టీ-20లో భారత్ కళ్లు చెదిరే విజయం సాధించింది. తీన్మార్ సిరీస్ మొదటి రెండుమ్యాచ్ లు ముగిసే సమయానికి 1-1తో సమఉజ్జీగా నిలిచింది. భారత్ జట్టుకు ముందుండి కీలకవిజయం అందించిన కెప్టెన్ రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Advertisement
Update:2022-09-24 09:45 IST

నాగపూర్ టీ-20లో భారత్ కళ్లు చెదిరే విజయం సాధించింది. తీన్మార్ సిరీస్ మొదటి రెండుమ్యాచ్ లు ముగిసే సమయానికి 1-1తో సమఉజ్జీగా నిలిచింది. భారత్ జట్టుకు ముందుండి కీలకవిజయం అందించిన కెప్టెన్ రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ప్రపంచ టాప్ ర్యాంకర్ భారత్, ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాజట్ల మధ్య జరుగుతున్న తీన్మార్ టీ-20 సిరీస్ నీకొకటి నాకొకటి అన్నట్లుగా సాగుతోంది. మొహాలీలో ముగిసిన

తొలిసమరంలో కంగారూ టీమ్ 4 వికెట్ల విజయంతో సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధిస్తే..నెగ్గితీరాల్సిన నాగపూర్ టీ-20 పోరులో ఆతిథ్య భారత్ 6 వికెట్లతో అద్దిరిపోయే విజయం నమోదు చేసి...సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకొంది.

వానదెబ్బతో 8 ఓవర్ల మ్యాచ్....

ఆరెంజ్ సిటీ నాగపూర్ లో గురువారం కుండపోతగా కురిసిన వర్షానికి మ్యాచ్ వేదిక విదర్భ క్రికెట్ స్టేడియం అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో..మ్యాచ్ నిర్వహణ ఆలస్యమయ్యింది. 20 ఓవర్ల మ్యాచ్ కాస్త...ఎనిమిది ఓవర్ల మ్యాచ్ గా మారిపోయింది.

తడిసి ముద్దైన అవుట్ ఫీల్డ్ ను మ్యాచ్ కు అనువుగా తయారు చేయటానికి నాగపూర్ స్టేడియం సిబ్భంది గంటల తరబడి శ్రమించడంతో..నిర్ణితసమయం కంటే రెండున్నర గంటలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమయ్యింది. రెండుజట్లూ రెండేసి మార్పులతో బరిలోకి దిగాయి. భారతజట్టు భువీ, ఉమేశ్ యాదవ్ లకు బదులుగా తుదిజట్టులోకి బుమ్రా, రిషభ్ పంత్ లను తీసుకొంది.

టాస్ నెగ్గిన రోహిత్...

టీ-20 మ్యాచ్ ల్లో టాస్ నెగ్గినజట్టు సగం మ్యాచ్ నెగ్గినట్లుగా భావించడం సాధారణ విషయమే. వర్షంతో 8 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో టాస్ మరీ కీలకమని చెప్పాల్సిన పనిలేదు. అయితే...భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఈసారి మాత్రం టాస్ రూపంలో అదృష్టం వరించింది. మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు.

పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ తో బరిలోకి దిగిన కంగారూ టాపార్డర్ ను లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ కట్టడి చేశాడు. అక్షర్ తన కోటా 2 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్ర్రేలియా 8 ఓవర్లలో 90 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 15 బాల్స్ లో 31 పరుగులు చేసి...బుమ్రా యార్కర్ కు చిక్కాడు.

సూపర్ హిట్టర్ మాథ్యూ వేడ్ మరో సూపర్ హిట్టింగ్ ఇన్నింగ్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వేడ్ 20 బాల్స్ లో 43 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు.

రోహిత్ రివర్స్ ఎటాక్....

మ్యాచ్ నెగ్గాలంటే 8 ఓవర్లలో 91 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్- రాహుల్ చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ తనదైనశైలిలో సిక్సర్లు, బౌండ్రీలతో కంగారూ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. పవర్ ప్లే ఓవర్లలోనే రోహిత్ మూడు సిక్సర్లు బాదాడు.

అయితే...ఓపెనర్ రాహుల్, వన్ డౌన్ విరాట్ కొహ్లీ, రెండో డౌన్ సూర్యకుమార్ యాదవ్ లను లెగ్ స్పిన్నర్ ఆడం జంపా వరుస ఓవర్లలో పడగొట్టడంతో భారత్ జోరు తగ్గింది.

అయినా...కెప్టెన్ రోహిత్ ఏమాత్రం తగ్గకుండా ఆడి 20 బాల్స్ లో 46 పరుగుల స్కోరుతో అజేయంగా నిలవడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే భారత్ 6 వికెట్ల విజయంతో సిరీస్ ను సమం చేయగలిగింది. రోహిత్ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

భారత్ ఆఖరి 7 బాల్స్ లో 14 పరుగులు చేయాల్సిన తరుణంలో మ్యాచ్ ను ముగించడంలో దిట్టగా పేరుపొందిన దినేశ్ కార్తీక్ వచ్చి కెప్టెన్ రోహిత్ తో కలిశాడు. ఆఖరి ఓవర్ మొదటి రెండు బంతుల్లోనే దినేశ్ కార్తీక్ ఓ సిక్సర్, బౌండ్రీ బాదడం ద్వారా మ్యాచ్ ను ముగించాడు.

ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ 25 టీ-20 మ్యాచ్ లు ఆడిన భారత్ కు ఇది 14వ విజయం కావడం మరో రికార్డు. ఆస్ట్ర్రేలియా 10 విజయాలు సాధించగా ఓ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన కెప్టెన్ రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని ఆఖరి, నిర్ణయాత్మక మ్యాచ్ హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 25న జరుగనుంది.

Tags:    
Advertisement

Similar News