ప్రపంచకప్ వైపు హిట్ మ్యాన్ చూపు!
టీ-20 ప్రపంచకప్ లో విజేతగా నిలవడమే తమ లక్ష్యమని మాజీ చాంపియన్ భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు
టీ-20 ప్రపంచకప్ లో విజేతగా నిలవడమే తమ లక్ష్యమని మాజీ చాంపియన్ భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. ప్రారంభమ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో సమరానికి తమజట్టు సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపాడు...
ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ లో విజేతగా నిలవడమే తమ లక్ష్యమని, కప్పు కొట్టడానికే తాము కంగారూల్యాండ్ కు వచ్చామని భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు.
2007 నుంచి తాను ప్రపంచకప్ లో ఓ ఆటగాడిగా మాత్రమే పాల్గొంటూ వచ్చానని, ఇప్పుడు జట్టు కెప్టెన్ గా బరిలోకి దిగుతున్నానని, తన జట్టును మరోసారి చాంపియన్ గా నిలపడమే తన లక్ష్యమని చెప్పాడు.
23న పాకిస్థాన్ తో తొలి పోరు..
సూపర్ -12 దశ ..గ్రూప్-ఏ తొలిరౌండ్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఈనెల 23న తలపడటానికి తాము సిద్ధమని రోహిత్ ప్రకటించాడు. తమజట్టులోని సభ్యులంతా ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నామని తెలిపాడు. తమజట్టు సభ్యులంతా ప్రశాంతంగా ఉంటే ఆశించిన లక్ష్యాన్ని చేరుకోడం ఏమంత కష్టంకాదని రోహిత్ చెప్పాడు.
తమపైన ఏమాత్రం ఒత్తిడిలేదని, కూల్ కూల్ గా ఉంటే ఫలితం దానంతట అదే వస్తుందని అన్నాడు. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ వేదికల్లో ఒకటైన మెల్బోర్న్ క్రికిట్ స్టేడియం వేదికగా భారత్- పాక్ జట్ల మధ్య జరిగే సమరానికి 80 వేల నుంచి లక్షమంది వరకూ క్రికెట్ అభిమానులు హాజరుకానున్నారు.
ఆసియాకప్ లో భాగంగా గత నెలలో రెండుసార్లు తలపడిన భారత్ ఓ గెలుపు, ఓ ఓటమి రికార్డుతో ఉంది. పాక్ ప్రత్యర్థిగా ఆడిన గత మూడుమ్యాచ్ ల్లో రెండు పరాజయాలు చవిచూడడం కూడా భారత్ ను కలవర పెడుతోంది.
అత్యధిక విజయాల కెప్టెన్ రోహిత్..
టీ-20 ఫార్మాట్లో అత్యంత భీకరమైన ఓపెనర్ గా పేరున్న రోహిత్ కు ఐపీఎల్ తో పాటు భారత్ కు సైతం అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా పేరుంది. రాహుల్ ద్రావిడ్ శిక్షకుడిగా పలువురు హేమాహేమీ ఆటగాళ్లతో కూడిన భారతజట్టుకు రోహిత్ నాయకత్వం వహిస్తున్నాడు.
తన కెరియర్ లో తొలిసారిగా ప్రపంచకప్ లో భారతజట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ ..ఆరునూరైనా ప్రపంచకప్ నెగ్గితీరాలన్న పట్టుదలతో ఉన్నాడు.
పాక్ ను ఎలా ఓడించాలో తనకు తెలుసునని, పాక్ పై నెగ్గటానికి అవసరమైన తుదిజట్టుతో తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.
పాక్ పై నెగ్గితే ప్రపంచకప్ సాధించినట్లే- రైనా..
ప్రస్తుత ప్రపంచకప్ సూపర్ -12 తొలిపోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను భారత్ ఓడించగలిగితే ప్రపంచకప్ సాధించడం ఏమంత కష్టంకాబోదని మాజీ ఆల్ రౌండర్ సురేశ్ రైనా జోస్యం చెప్పాడు. పాక్ పైన విజయం సాధించగలిగితే..భారతజట్టుకు అదో గొప్పటానిక్ లా పనిచేస్తుందని అన్నాడు.
మరోవైపు..భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మాత్రం..రోహిత్ సేనకు సెమీస్ చేరే అవకాశాలు 30 శాతం మాత్రమే ఉన్నాయంటూ తన మనసులో మాట బయటపెట్టారు.
భారత్ విజేతగా నిలవాలంటే హార్ధిక్ పాండ్యా లాంటి ఆల్ రౌండర్ అత్యుత్తమంగా రాణించితీరక తప్పదని అన్నారు. టీ-20 ఫార్మాట్లో ఏజట్టుకైనా ఆల్ రౌండర్లే అదనపు బలమని, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో రాణించే మొనగాళ్లుంటే..ఆయాజట్ల కెప్టెన్లకు అదనపు బౌలర్ లేదా బ్యాటర్ ను తుదిజట్టులోకి తీసుకొనే వెసలుబాటు ఉంటుందని కపిల్ అన్నారు.
నెగ్గకుంటేనే ఆశ్చర్యపోవాలి- గవాస్కర్
ప్రస్తుత ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలువకుంటేనే ఆశ్చర్యపోవాలంటూ భారత మాజీ కెప్టెన్, విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రపంచకప్ కు భారతజట్టు సన్నాహాలు ఉన్నాయని, గత ఏడాదికాలంగా టీ-20 ఫార్మాట్ పైనే భారతజట్టు టీమ్ మేనేజ్ మెంట్ దృష్టి కేంద్రీకరించిందని గవాస్కర్ గుర్తు చేశారు.
తన దృష్టిలో ఆతిథ్య ఆస్ట్ర్ర్రేలియాతో పాటు భారత్ కు మాత్రమే ప్రపంచకప్ నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు.