ఒలింపిక్స్ గోల్డెన్ అథ్లెట్లకు భలే చాన్స్!

పారిస్ ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో గోల్డెన్ అథ్లెట్ల కోసం భారీనజరానా సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య తొలిసారిగా భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది.

Advertisement
Update:2024-04-13 11:00 IST

పారిస్ ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో గోల్డెన్ అథ్లెట్ల కోసం భారీనజరానా సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య తొలిసారిగా భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది.

2024-పారిస్ ఒలింపిక్స్ లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగాలలో స్వర్ణ పతకాలు సాధించే 45 మంది అథ్లెట్ల కోసం నజరానాల రూపంలో కోట్ల రూపాయలు ఎదురుచూస్తున్నాయి.

బంగారు పతకానికి 4 కోట్ల రూపాయలు..

అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య తొలిసారిగా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ లకు భారీ ప్రోత్సాహక నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జులై- ఆగస్టు మాసాలలో జరిగే పారిస్ ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో మొత్తం 45 అంశాలు నిర్వహిస్తారు. వ్యక్తిగత అంశాల నుంచి రిలే ( టీమ్ ) అంశాల వరకూ 45 బంగారు పతకాలు కోసం పోటీలు జరుగుతాయి.

ఒక్కో విభాగంలో స్వర్ణ విజేతగా నిలిచిన మొత్తం 45 మందికి 50 వేల డాలర్లు ( సుమారు 4 కోట్ల రూపాయలు ) చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతి ఇస్తామని అంతర్జాతీయ ఒలింపిక్స్ సమాఖ్య ప్రతినిధి సెబాస్టియన్ కో ప్రకటించారు.

నీరజ్ చోప్రా హర్షం...

ఒలింపిక్స్ లో సైతం అథ్లెట్లను ప్రోత్సహించడానికి వీలుగా అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య నగదు బహుమతి ప్రకటించడం పట్ల భారత స్టార్ అథ్లెట్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా సంతోషం వ్యక్తం చేశాడు. ఇది చాలా మంచినిర్ణయమని, బంగారు పతకంతో పాటు భారీ ప్రోత్సాహక నగదు బహుమతి అందుకోడం..అథ్లెట్ల కష్టానికి తగ్గ ప్రతిఫలమని చెప్పాడు.

ప్రపంచ పురుషుల జావలిన్ త్రోలో ప్రస్తుత ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ గా ఉన్న 26 సంవత్సరాల నీరజ్ చోప్రా..పారిస్ ఒలింపిక్స్ లో సైతం హాట్ ఫేవరెట్ గా బంగారు వేటకు దిగనున్నాడు.

ఒలింపిక్స్ కు ముందే 90 మీటర్ల లక్ష్యం...

ఒలింపిక్స్ లో భారత్ కు కచ్చితంగా బంగారు పతకం అందించే సత్తా ఉన్న ఏకైక అథ్లెట్ నీరజ్ చోప్రా..మరి కొద్దివారాలలో ప్రారంభంకానున్న పారిస్ ఒలింపిక్స్ లో సైతం స్వర్ణ పతకం సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే 90 మీటర్ల లక్ష్యం చేరుకోగలనన్న ధీమాను వ్యక్తం చేశాడు. 2022 స్టాక్ హోం డైమండ్ లీగ్ పోరులో 89.94 మీటర్ల దూరం జావలిన్ విసిరిన నీరజ్..తదుపరి లక్ష్యం 90 మీటర్లుగా ఉంది.

పారిస్ ఒలింపిక్స్ కు తాను పూర్తిస్థాయిలో సిద్ధమయ్యానని..2020 టోక్యో ఒలింపిక్స్ లో సాధించిన బంగారు పతకాన్ని పారిస్ ఒలింపిక్స్ లోనూ నిలుపుకొంటానని తెలిపాడు.

ప్రస్తుతం తన ఫిట్ నెస్ అత్యుత్తమంగా ఉందని, తన ప్రాక్టీసు సైతం అత్యుత్తమంగా ఉందని, పారిస్ ఒలింపిక్స్ కు ముందు జరిగే రెండు సన్నాహక పోటీలలో 90 మీటర్ల లక్ష్యం చేరుకోడానికి ప్రయత్నిస్తానని వివరించాడు.

టోక్యో ఒలింపిక్స్ స్వర్ణంతో తన ఆత్మవిశ్వాసం పెరిగిందని, రెండు ప్రపంచ టోర్నీలలో రజత, స్వర్ణాలు సాధించడంతో పాటు..డైమండ్ లీగ్ ట్రోఫీని అందుకోడం, ఆసియాక్రీడల బంగారు పతకం నిలుపుకోడం తనకు సంతృప్తినిచ్చినట్లు తెలిపాడు.

తనలోని లోపాలను పూర్తిస్థాయిలో సవరించుకొని పారిస్ ఒలింపిక్స్ కు సమాయత్తమవుతున్నట్లు చెప్పాడు. జర్మనీకి చెందిన 19 సంవత్సరాల సంచలనం మాక్స్ డహ్లిన్ 90 మీటర్ల రికార్డు సాధించడం, అతనితో తాను పోటీ కోసం ఎదురుచూస్తున్నట్లు వివరించాడు.

హాంగ్జు ఆసియాక్రీడల్లో 87.54 మీటర్ల రికార్డుతో రజత పతకం సాధించిన కిశోర్ జెనాకు సైతం 90 మీటర్ల లక్ష్యం చేరే సత్తా లేకపోలేదని నీరజ్ అభిప్రాయపడ్డాడు.

Tags:    
Advertisement

Similar News