భారత ఒలింపియన్లకు బీసీసీఐ భారీసాయం!

సాయం చేయటంలో తన తరువాతే ఎవరైనా అంటూ బీసీసీఐ మరోసారి ముందుకొచ్చింది. పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్లకు భారీసాయం ప్రకటించింది.

Advertisement
Update:2024-07-22 16:09 IST

సాయం చేయటంలో తన తరువాతే ఎవరైనా అంటూ బీసీసీఐ మరోసారి ముందుకొచ్చింది. పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్లకు భారీసాయం ప్రకటించింది.

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు మరోసారి తన దొడ్డమనసు చాటుకొంది. క్రికెట్ ద్వారా తాను సంపాదిస్తున్న వందలకోట్ల రూపాయల ఆదాయం నుంచి క్రికెటేతర క్రీడాకారుల కోసం సైతం కొంతమొత్తం వెచ్చిస్తోంది.

ఈనెల 26 నుంచి పారిస్ వేదికగా ప్రారంభంకానున్న 2024 ఒలింపిక్స్ లో పాల్గోనున్న 117 మంది భారత అథ్లెట్ల బృందానికి తనవంతుగా 8 కోట్ల 50 లక్షల రూపాయలు సాయం ప్రకటించింది.

ఇదే మొదటిసారికాదు....

క్రికెట్ అభివృద్ధికోసం పాటుపడుతున్నవారికి భారీమొత్తాలు అందచేస్తున్న బీసీసీఐ..క్రికెట్ తో ఏమాత్రం సంబంధంలేని క్రీడలకు చెందిన వారికి కూడా గత కొద్దిసంవత్సరాలుగా కొంతమొత్తం సాయం చేస్తూ వస్తోంది.

కరోనా సమయంలో తనవంతుగా 51 కోట్ల రూపాయల విరాళాన్ని కేంద్రప్రభుత్వానికి అందచేసిన బీసీసీఐ...బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న మాజీ క్రికెటర్ అంషుమన్ గయక్వాడ్ కు గతంలో కోటి..కొద్దిరోజుల క్రితమే మరో కోటి రూపాయలు సాయంగా అందించింది. అంతేనా..17 సంవత్సరాల విరామం తరువాత భారత్ కు టీ-20 ప్రపంచకప్ సాధించి పెట్టిన రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు సభ్యులకు సైతం 125 కోట్ల రూపాయలు నజరానాగా అందచేసింది.

ఒలింపియన్లకు బాసటగా....

జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకూ పారిస్ లో జరిగే ఒలింపిక్స్ లో పాల్గొనటానికి 117 మంది అథ్లెట్లతో భారత బృందం, వారికి సహాయకులుగా 140 మంది శిక్షకులు, ఇతర సిబ్బంది సైతం పాల్గొనబోతున్నారు.

మొత్తం 257 మంది సభ్యులతో కూడిన భారత అథ్లెట్ల దళం కోసం బీసీసీఐ తనవంతుగా 8 కోట్ల 50 లక్షల రూపాయల సాయాన్ని ప్రకటించింది. బీసీసీఐ కార్యదర్శి జే షా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్న 117 మంది అథ్లెట్లకు తమవంతుగా ఆర్థిక తోడ్పాటు అందించడం తమ అదృష్టమని, గర్వకారణం కూడానని బీసీసీఐ కార్యదర్శి తన సందేశంలో వెల్లడించారు.

కేంద్ర క్రీడామంత్రి కృతజ్ఞత...

ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల బృందం కోసం బీసీసీఐ 8 కోట్ల 50 లక్షల రూపాయలు అందచేయటం అభినందనీయమని, క్రికెటేతర క్రీడాకారుల పట్ల ఇంత ఉదారంగా వ్యవహరించిన బీసీసీఐకి కృతజ్ఞతలు అంటూ..కేంద్ర క్రీడలు, యువజనవ్యవహారాల మంత్రి మాండవ్యా తన ప్రతిసందేశంలో పేర్కొన్నారు.

బీసీసీఐ ఈ నిర్ణయంతో భారత అథ్లెట్లు మరింత ఉత్సాహంతో పతకాలవేటకు దిగుతారని, గత ఒలింపిక్స్ లో సాధించిన పతకాల కంటే ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో ఎక్కువ పతకాలు సాధించగలరన్న నమ్మకం తనకుందని క్రీడామంత్రి చెప్పారు.

మొత్తం 117 మంది భారత అథ్లెట్ల బృందంలో 24 మంది భారత సైనికదళాలకు చెందినవారే కావడం విశేషం. పైగా..ప్రారంభ వేడుకల్లో పాల్గొనే భారత బృందానికి..

తెలుగుతేజాలు ఆచంట శరత్ కమల్, పీవీ సింధు సంయుక్త పతాకధారులుగా వ్యవహరించనున్నారు.

2020 టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు బంగారు పతకం అందించిన బల్లెం విసురుడులో బాహుబలి నీరజ్ చోప్రా..పారిస్ లో సైతం స్వర్ణ పతకం సాధించగలనన్న ధీమాతో ఉన్నాడు. భారత హాకీజట్టు సైతం ఏదో ఒక పతకంతో తిరిగిరావాలన్న పట్టుదలతో ఉంది.

Tags:    
Advertisement

Similar News