ఎంవీఏను ముంచింది కాంగ్రెస్ అతివిశ్వాసమే
శివసేన (యూబీటీ) సీనియర్‌నేత అంబాదాస్ ధన్వే ధ్వజం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మహా వికాస్ అఘాడీలోని విభేదాలు మరోసారి బైటపడ్డాయి. 46 స్థానాలకే పరిమితమైన ఎంవీఏ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా శివసేన (యూబీటీ) సీనియర్‌నేత అంబాదాస్ ధన్వే కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ అతి విశ్వాసం, సీట్ల సర్దుబాటు సమయంలో వ్యవహరించిన తీరుతోనే ఎంవీఏ అవకాశాలు దెబ్బతీశాయని ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రేను ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష ఎంవీఏ దారుణమైన ఫలితాలుగా రాగా.. శివసేన(యూబీటీ) 20 స్థానాలకే పరిమితమైంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా మహావికాస్ అఘాడీ నేతలు సీట్ల సర్దుబాటులో జాప్యం చేశారు. చివరికి ఏకాభిప్రాయంతో పోటీ చేశారా అంటే అదీ లేదు. కొన్ని సీట్లపై ఎవరూ తగ్గకపోవడంతో చివరికి దాదాపు 20పైగా నియోజకవర్గాల్లో ఫ్రెండ్లీ కంటెస్ట్ అంటూ ప్రకటనలు చేశారు. చివరికి అన్నిపార్టీలు మునిగాయి.