'మహా'లో సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు

డిప్యూటీ సీఎంగా పనిచేయడానికి శిండే అంగీకరించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

Advertisement
Update:2024-12-03 15:02 IST

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి భాగస్వామ్యపక్షాల కీలక చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ముంబయిలో డిసెంబర్‌ 5వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎంగా, ఏక్‌నాథ్‌ శిండే, అజిత్‌ పవార్‌లు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేయనున్నారు.

ప్రమాణ స్వీకారానికి అనుగుణంగా బీజేపీ, శివసేన, ఎన్సీపీల మధ్య కేబినెట్ కేటాయింపులు ఉండబోతున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 132 సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన మెజారిటీ మార్క్‌ కు 13 సీట్ల దూరంలోనే ఉన్నది. అయితే సీఎం ఎంపిక విషయంలో ఆలస్యం కావడానికి కారణం ఏక్‌నాథ్‌ శిండేనే. ఆయన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తానని చెప్పినా సీఎంగా తననే కొనసాగించాలని పట్టుబట్టారు. దీనిపై మహాయుతి కూటమిలోని శివసేన, బీజేపీ నేతల మధ్య భిన్నవాదనలు వ్యక్తమయ్యాయి. అయితే బీజేపీ అధిష్ఠానం ప్రభుత్వ ఏర్పాటు విషయంలో శిండేను ఒప్పించిన తర్వాతే ముందుకెళ్లాలని భావించింది. ఆయన అంగీకారం తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు, సీఎం పై ప్రకటన చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రెండేళ్లు మహారాష్ట్ర సీఎంగా పనిచేసిన శిండే చివరికి దేవేంద్ర ఫడ్నవీస్‌ నాయకత్వంలో పనిచేయడానికి సుమఖత వ్యక్తం చేయడంతో మహాయుతి ప్రభుత్వ ఏర్పాటునకు మార్గం సుగమం అయ్యింది. 

కేబినెట్‌ ఏ పార్టీకి ఎన్ని?

బీజేపీ 21-22 సీట్లు తీసుకోబోతున్నట్లు సమాచారం. వీటిలో కీలకమైన హోం, రెవెన్యూ శాఖలతో పాటు అసెంబ్లీ స్పీకర్‌, మండలి ఛైర్మన్‌ పదవులు ఆపార్టీ తన వద్దే ఉంచుకోవాలనుకుంటున్నది.

శివసేన 16 మంత్రి పదవులు ఆశిస్తున్నది. అయితే 12 మంత్రి పదవులకు అంగీకరించినట్లు తెలుస్తోంది. వీటిలో పట్టణాభివృద్ధి శాకతో పాటు కౌన్సిల్‌ ఛైర్మన్‌ పదవి ఇవ్వాలని కోరుతున్నది. ఇప్పటికే మండలిలో డిప్యూటీ స్పీకర్‌ పదవిని నిర్వహిస్తున్నది.

ఎన్సీపీ 9-10 మంత్రి పదవులు దక్కవచ్చు. వీటిలో ఆర్థికం మంత్రిత్వ శాఖతో పాటు డిప్యూటీ స్పీకర్‌ పదవి దక్కవచ్చు అంటున్నారు. 

Advertisement

Similar News