కోవిడ్ వ్యాక్సిన్లు,బూస్టర్ షాట్‌లను ఇకపై కేంద్ర ఇవ్వదు.. నేరుగా రాష్ట్రాలే కొనుగోలు చేయాలన్న‌ మోడీ సర్కార్

దేశంలో కోవిడ్ ప‌రిస్థితుల‌పై శుక్రవారం జరిగిన సమీక్ష సందర్భంగా, కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్లు, బూస్టర్ షాట్‌లను బహిరంగ మార్కెట్ నుండి నేరుగా కొనుగోలు చేసుకోవాల‌ని రాష్ట్రాలకు సూచించారు.

Advertisement
Update:2023-04-07 17:53 IST

కోవిడ్ వ్యాక్సిన్లు, బూస్టర్ షాట్‌లను కేంద్రమే రాష్ట్రాలకు సరఫరా చేసే పద్దతిని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆపేసింది. ఇకపై రాష్ట్రాలే నేరుగా కొనుగోలు చేయాలని సూచించింది. దేశంలో కోవిడ్ పరిస్థితిపై శుక్రవారం జరిగిన సమీక్ష సందర్భంగా, కేంద్ర ఆరోగ్య శాఖ‌ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్లు, బూస్టర్ షాట్‌లను బహిరంగ మార్కెట్ నుండి నేరుగా కొనుగోలు చేసుకోవాల‌ని రాష్ట్రాలకు సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు కూడా పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్‌లో, కోవిడ్ వ్యాక్సిన్‌ల సేకరణలో ఇకపై కేంద్రం జోక్యం చేసుకోదని కేంద్ర ఆరోగ్య శాఖ‌ మంత్రి స్పష్టం చేశారు. బహిరంగ మార్కెట్‌లో తగినంత బఫర్ స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు.

అంతకుముందు, వీడియో కాన్ఫరెన్స్‌లో, తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలకు కోవిడ్ వ్యాక్సిన్ డోసులు, బూస్టర్ షాట్లు అందుబాటులో ఉండేలా చూడాలని హరీష్ రావు కేంద్ర ఆరోగ్య మంత్రిని కోరారు.

“జనాభాలో ఎక్కువ మందికి కోవిడ్ వ్యాక్సిన్లు, బూస్టర్ షాట్‌లను అందించడంలో తెలంగాణ ముందంజలో ఉంది. అయితే, గత కొన్ని నెలలుగా, మాకు కేంద్రం నుండి కోవిడ్ వ్యాక్సిన్‌ల స్టాక్ రావడం లేదు. ఇటీవల కాలంలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌ల పెరుగుదల, రోగనిరోధక శక్తి క్షీణిస్తున్న దృష్ట్యా, బూస్టర్ షాట్‌ల బఫర్ స్టాక్ రాష్ట్రాలకు చాలా అవసరం ”అని హరీష్ రావు అన్నారు.

కోవిడ్ సమీక్షా సమావేశంలో, ఇతర రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు కూడా ఇదే విధమైన అభ్యర్థన చేశారు. కోవిడ్ వ్యాక్సిన్‌లను కేంద్రమే సేకరించి అందించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరారు. అయితే, రాష్ట్రాలే కోవిడ్ వ్యాక్సిన్లు, బూస్టర్ షాట్‌లను నేరుగా బహిరంగ మార్కెట్ నుండి సేకరించడం ఉత్తమమైన మార్గమని మన్సుఖ్ మాండవియా స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News