బీఆరెస్ ఔరంగాబాద్ సభకు ముందే ఆ పార్టీలో భారీగా చేరికలు
ఇప్పటిదాకా తెలంగాణ సరిహద్దుగల మహారాష్ట్ర నుంచే నాయకులు బీఆరెస్ లో చేరగా ఇప్పుడు చేరికల ఊపు రాష్ట్రవ్యాప్తమయ్యింది. మాజీ ఎమ్మెల్యే, శివసేన సీనియర్ నేత అన్నా సాహెబ్ మానె ఆదివారం కేసీఆర్ సమక్షంలో బీఆరెస్ లో చేరారు.
మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి విస్తరణ వాయువేగంతో సాగుతోంది. పార్టీ ప్రకటించిన నాటి నుంచే మహారాష్ట్ర నుంచి మంచి స్పందన కనపడుతోంది. ఇప్పటికే మహా రాష్ట్రలో రెండు బహిరంగలు నిర్వహించిన బీఆరెస్ ఈ నెల 24న ఔరంగాబాద్ లో మరో బహిరంగ సభ నిర్వహించనుంది.
ఇప్పటిదాకా తెలంగాణ సరిహద్దుగల మహారాష్ట్ర నుంచే నాయకులు బీఆరెస్ లో చేరగా ఇప్పుడు చేరికల ఊపు రాష్ట్రవ్యాప్తమయ్యింది. మాజీ ఎమ్మెల్యే, శివసేన సీనియర్ నేత అన్నా సాహెబ్ మానె ఆదివారం కేసీఆర్ సమక్షంలో బీఆరెస్ లో చేరారు. ఆయనతో పాటు గంగాపూర్ నియోజకవర్గానికి చెందిన సంతోష్‌కుమార్, ఔరంగాబాద్ ఎన్సీపీ యూత్ ప్రెసిడెంట్ ప్రశాంత్ పాటిల్ కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.
సంతోష్‌కుమార్ గత ఎన్నికల్లో ఎన్సీపీ తరఫున గంగాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 82 వేల ఓట్లు సాధించారు. నిన్న బీఆరెస్ లో చేరిన ముగ్గురు నేతలు ఔరంగాబాద్ జిల్లాలో చాలా కీలకమైనవారు. రాజకీయంగా పట్టు, ప్రజల్లో ఆదరణ ఉన్నవారు.
ఈ నెల 24న ఔరంగాబాద్‌లో జరగనున్న బహిరంగసభలో వివిధ పార్టీలకు చెందిన మరింత మంది నాయకులు బీఆరెస్ లో చేరనున్నారని సమాచారం. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చేరికలతో బీఆరెస్ నేతలు మంచి జోష్ మీద ఉన్నారు.