రేవంత్‌.. ఏమిటీ 'హైడ్రా'మా!?

ముఖ్యమంత్రికి కాంగ్రెస్‌ హైకమాండ్‌ పిలుపు.. కూల్చివేతలపై వివరణ కోసం రెండోసారి ఢిల్లీకి ఆదేశించిన పార్టీ అధిష్టానం

Advertisement
Update:2024-09-30 20:04 IST

తెలంగాణలో పేదల ఇండ్ల కూల్చివేతలపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌ అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని వెంటనే ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హైదరాబాద్‌ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో పేదల ఇండ్ల కూల్చివేతలు, మూసీ నది గర్భం, నది పరిసరాల్లో అక్రమంగా నివాసం ఉంటున్నారనే పేరుతో 18 వేల మంది ఇండ్ల కూల్చివేతలకు మార్కింగ్‌ చేయడాన్ని పార్టీ హైకమాండ్‌ సీరియస్‌ గా తీసుకుంది. ఈ వ్యవహారం మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో పెద్ద ఎత్తున కవర్‌ కాకుండా రేవంత్‌ ప్రయత్నించినా.. పార్టీ హైకమాండ్‌ కు సొంత పార్టీ నాయకులతో పాటు వివిధ సెక్షన్ల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని పార్టీ పెద్దలు ఆదేశించారు. హైడ్రా కూల్చివేతలపై రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్టానం ఢిల్లీకి పిలిపించడం ఇది రెండోసారి. ఆగస్టు 23న మొదటిసారి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోదరుడికి చెందిన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ తో పాటు ఇతరుల ఇండ్ల కూల్చివేతలపై రేవంత్‌ రెడ్డిని వివరణ అడిగింది. ఏకపక్షంగా కూల్చివేతలు మంచివి కాదని, పార్టీకి చెడ్డపేరు వస్తుందని.. ఇకనైనా దూకుడు తగ్గించుకోవాలని హెచ్చరించింది. పార్టీ హైకమాండ్‌ క్లాస్‌ తీసుకున్న తర్వాత కూడా రేవంత్‌ తీరులో పెద్దగా మార్పు రాలేదు. హైడ్రా కూల్చివేతలు దూకుడుగా సాగుతున్నాయి. పేదల ఇండ్లను కూల్చివేస్తున్న వీడియో.. ఆయా కుటుంబాల కన్నీటి గాథలు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ మరోసారి రేవంత్‌ ను ఇదే విషయంలో వివరణ కోరుతూ ఢిల్లీకి రావాలని ఆదేశించింది.

కాంగ్రెస్‌ అంటేనే పేదల పార్టీ అని.. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బహుజనులే పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్నారని ఆ పార్టీ హైకమాండ్‌ కు సొంత పార్టీ నాయకులు విన్నవించుకున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆయా వర్గాలనే టార్గెట్‌ చేసి వాళ్ల ఆస్తులను కూల్చేసి కట్టుబట్టలతో నడి రోడ్డుపై నిలబెడుతున్నారని.. దీంతో ఆయా వర్గాలు కాంగ్రెస్‌ పై ద్వేషం పెంచుకునే అవకాశం ఉందని వివరించాయి. రేవంత్‌ రెడ్డి ఏకపక్ష, దుందుడుకు చర్యలను సమర్థించలేక తాము తంటాలు పడుతున్నామని పలువురు సీనియర్‌ మంత్రులు సైతం హైకమాండ్‌ పెద్దలకు ఫిర్యాదు చేశారు. రేవంత్‌ తో పాటు హైడ్రా దూకుడుకు పగ్గాలు వేయకుంటే కాంగ్రెస్‌ పుట్టి మునగడం ఖాయమని తెలిపారు. అవసరమైతే ముఖ్యమంత్రిని మార్చాలని కూడా కొందరు సీనియర్‌ లీడర్లు పార్టీ హైకమాండ్‌ ను కోరినట్టు తెలుస్తోంది. హైడ్రా కూల్చివేతలకు రాహుల్‌ గాంధీ ఆమోదం ఉందని రేవంత్‌ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పై ప్రభావం చూపిస్తుందని కూడా ఫిర్యాదు చేశారు. రాహుల్‌ గాంధీ ఆమోదంతోనే పేదల ఇండ్లు కూల్చేస్తున్నారంటే కాంగ్రెస్‌ పార్టీ ఎలా తలెత్తుకోగలదని కూడా హైకమాండ్‌ పెద్దలను కొందరు లీడర్లు ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డిని పార్టీ పెద్దలు ఢిల్లీకి పిలిపించారని సమాచారం. ఈ టూర్‌ లో హైడ్రా పేరుతో కూల్చివేతలకు చెక్‌ పెట్టాలని, ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా జాగ్రత్త పడాలని రేవంత్‌ కు పార్టీ పెద్దలు కాస్త గట్టిగానే చెప్పే అవకాశమున్నట్టు హస్తం పార్టీ ముఖ్య నేతలే చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News