కేసీఆర్, జగన్ మధ్య ఉన్నది 'వ్యూహాత్మక' దూరమా?

ఇరు పార్టీల తీరు చూస్తుంటే ప్రస్తుతానికి వ్యూహాత్మక దూరం పాటిస్తున్నట్లే అర్థం అవుతోంది. కొంత కాలం పాటు ఇలాగే వ్యవహరించడం బెటర్ అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Advertisement
Update:2022-07-19 08:56 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య దూరం పెరిగిందా? గతంలో మంచి మిత్రులుగా ఉన్న వీరు ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటున్నారా? విభజన అంశాలపై కలసి కొట్లాడుదాం అనుకున్న మిత్రులు ఇప్పుడు.. స్వప్రయోజనాలు చూసుకుంటున్నారా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తున్నది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు సీఎం అయిన కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీని బలమైన రాజకీయ శక్తిగా మార్చుకున్నారు. మొదటి నుంచి టీడీపీకి బద్ద విరోధిగా ఉన్న కేసీఆర్.. చంద్రబాబుపై రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వైరం పెట్టుకున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ ఊసే లేకుండా చేసి కేసీఆర్ తన కసి తీర్చుకున్నారు.

ఆ సమయంలో ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌కు కేసీఆర్ కావల్సినంత సపోర్ట్ చేశారు. తర్వాత సీఎం జగనే అంటూ కేటీఆర్ కూడా అప్పట్లో వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, వైసీపీకి టీడీపీ ఉమ్మడి శత్రువు కావడంతో ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయి. బయటకు కనిపించక పోయినా.. తెలంగాణలో ఒక సామాజిక వర్గం టీఆర్ఎస్‌కు దగ్గర కావడానికి పరోక్షంగా వైఎస్ జగన్ కారణమయ్యారు. ఏపీకి సీఎం అయిన తర్వాత జగన్ స్వయంగా ప్రగతిభవన్ వచ్చి కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు. మొదట్లో ఇరు పార్టీలు ఒకే మాటపై నిలబడి పాలన సాగించినట్లే కనపడింది. కానీ ఇటీవల ఇరు పార్టీల మధ్య స్పష్టమైన దూరం కనిపిస్తోంది.

వైసీపీ, టీఆర్ఎస్ మధ్య స్నేహం చాలా కాలం పాటు బహిరంగంగానే సాగింది. ఇరు రాష్ట్రాల్లోని రెండు బలమైన పార్టీలు ఒకే తాటిపై ఉండటం కేంద్రంలోని బీజేపీకి కూడా అడ్డంకిగా మారింది. దీంతో నెమ్మదిగా బీజేపీ పావులు కదిపింది. ఒక వ్యూహం ప్రకారం ఏపీలోని వైసీపీని తమవైపు లాగేసుకున్నది. చంద్రబాబు పాలనలో అత్యధిక అప్పులు చేయడంతో.. తర్వాత సీఎం అయిన జగన్‌కు నిధుల కొరత ఏర్పడింది. కేంద్రంలోని బీజేపీతో సఖ్యతగా లేకుంటే రాష్ట్రానికి రావల్సిన నిధులను రాబట్టుకోలేమని అనుకున్నారు. దీంతో ఎప్పటికప్పుడు బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉంటూ వచ్చారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలను కలుస్తూ రాష్ట్రానికి కావల్సిన వాటాను రాబట్టడంలో జగన్ సఫలమయ్యారు. అదే సమయంలో పలు బిల్లుల సమయంలో వైసీపీ బేషరతు మద్దతు ఇచ్చింది.

మరోవైపు కేసీఆర్ కూడా మొదట్లో బీజేపీతో సన్నిహితంగానే ఉన్నారు. పార్లమెంటులో పలు బిల్లులను పాస్ చేయించుకునే సమయంలో బీజేపీ కూడా టీఆర్ఎస్ మద్దతు తీసుకున్నది. కానీ, రాష్ట్రంలో ఇరు పార్టీల మధ్య ఉపఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎలక్షన్ కాక పుట్టించింది. దీంతో బీజేపీతో టీఆర్ఎస్ దూరం పెరిగిపోయింది. అధినేత కేసీఆర్ ఏకంగా కేంద్రాన్ని ఢీకొట్టారు. మంత్రి కేటీఆర్ కూడా ప్రతీ రోజు సోషల్ మీడియా వేదికగా బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. తెలంగాణకు రావల్సిన నిధులను కేంద్రం అడ్డుకుంటోందని బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

టీఆర్ఎస్, వైసీపీ మధ్య దూరం పెరగడానికి బీజేపీనే కారణం అన్నది బహిరంగ రహస్యమే. రాష్ట్రపతి ఎన్నిక సమయంలో ఆ విషయం మరింత స్పష్టంగా తెలిసింది. టీఆర్ఎస్ విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు, వైసీపీ ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదికి సపోర్ట్ చేశాయి. అంతే కాకుండా తమ దారులు వేరే అని ఈ మధ్య స్పష్టంగా చెప్తున్నాయి. కేంద్రంపై యుద్దం ప్రకటించిన టీఆర్ఎస్‌తో వీలైనంత దూరంగా ఉండాలనేదే వైఎస్ జగన్ నిర్ణయంగా చెబుతున్నారు. అలాగే టీఆర్ఎస్‌తో గొడవలు కూడా అవసరం లేదని ఆయన అనుకుంటున్నారు. టీఆర్ఎస్‌తో గొడవ లేదా స్నేహం వల్ల ఇప్పటికిప్పుడు చేకూరే ప్రయోజనాలు కూడా లేనప్పుడు అసలు ఆ పార్టీ గురించి పట్టించుకోవ‌ల్సిన అవసరం లేదని కూడా చర్చ జరిగినట్లు తెలుస్తున్నది.

కేసీఆర్, కేటీఆర్ అడపాదడపా తోటి తెలుగు రాష్ట్రంపై విసుర్లు విసిరినా.. సీఎం జగన్‌ను మాత్రం ఏనాడూ టార్గెట్ చేయలేదు. ఇరు పార్టీల తీరు చూస్తుంటే ప్రస్తుతానికి వ్యూహాత్మక దూరం పాటిస్తున్నట్లే అర్థం అవుతోంది. కొంత కాలం పాటు ఇలాగే వ్యవహరించడం బెటర్ అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇరు పార్టీల స్నేహం కేవలం కొన్ని అంశాలకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇరు పార్టీ మధ్య వ్యవహారాలు చూస్తే.. జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ వస్తే వైసీపీ సపోర్ట్ చేసే అవకాశమే లేదని అంటున్నారు. సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల వరకు ఇరు పార్టీల మధ్య ఇదే దూరం కొనసాగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

Tags:    
Advertisement

Similar News