దొంగల్ని పట్టించిన పేటీఎం.. ఎలాగంటే..?

నగదు లావాదేవీలకు సంబంధించి దోపిడీ దొంగలు వాడిన ఫోన్ నెంబర్ దొరికింది. సెల్ ఫోన్లు పెద్దగా ఉపయోగించలేదు కాబట్టి, వారు వాటిని పారవేయలేదు, సిమ్ కార్డుల్ని మార్చలేదు. దీంతో పోలీసుల పని మరింత సులువైంది.

Advertisement
Update:2022-09-04 11:56 IST

పేటీఎం నగదు లావాదేవీల కోసమే కాదు, దొంగల్ని పట్టివ్వడంలో కూడా ఉపయోగపడుతోంది. తాజాగా ఢిల్లీలో 6 కోట్ల విలువైన దొంగతనాన్ని ఛేదించడంలో సాయపడింది. దొంగల్ని పోలీసులు పట్టుకోవడంలో పేటీఎం ట్రాన్సాక్షన్ కీలకంగా మారింది. ఇంతకీ పేటీఎం ద్వారా దొంగల్ని ఎలా పట్టుకున్నారని అనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి..

ఢిల్లీలోని పహర్ గంజ్ లోని ఓ నగల దుకాణంలో పనిచేస్తున్న సోమవీర్ అనే డెలివరీ బాయ్.. తన స్నేహితుడు జగదీప్ షైనీతో కలసి నగలు వేరే షాపులో ఇచ్చేందుకు బయలుదేరాడు. అయితే వీరి వ్యవహారంపై నిఘా పెట్టిన దోపిడీ దొంగలు ముందుగా అనుకున్న పథకం ప్రకారం ఓ కూడలిలో వీరి బైక్ ని అడ్డుకున్నారు. కళ్లలో కారం కొట్టి నగల బ్యాగ్ ని దోచుకెళ్లారు. వాటి విలువ 6 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ముందుగా పోలీసులు డెలివరీ బాయ్ ని, అతడి స్నేహితుడిని అనుమానించారు. కానీ ఆ దొంగతనంతో వారికి సంబంధం లేదని తేలిపోయింది. ఆ తర్వాత సీసీ టీవీ ఫుటేజీ ద్వారా ఇద్దరు దొంగలు నగల బ్యాగ్ ని తీసుకుని పారిపోయినట్టు తేలింది. వెళ్లే సమయంలో వారు ఎక్కిన క్యాబ్ నెంబర్ ఆధారంగా పోలీసులు కేసు ఛేదించారు. ఆ క్యాబ్ డ్రైవర్ తనకే పాపం తెలియదన్నాడు. అయితే అతను ఇచ్చిన ఓ క్లూ కేసు ఛేదనకు పనికొచ్చింది. క్యాబ్ లో వెళ్లే సమయంలో వారు ఓ టీకొట్టు దగ్గర ఆగారని, నగదు లేదంటూ పేటీఎం ద్వారా టీ డబ్బులు ఇచ్చారని చెప్పాడు డ్రైవర్. దీంతో పోలీసులు ఆ టీ బంకు దగ్గరకు వచ్చారు.

నగదు లావాదేవీలకు సంబంధించి దోపిడీ దొంగలు వాడిన ఫోన్ నెంబర్ దొరికింది. సెల్ ఫోన్లు పెద్దగా ఉపయోగించలేదు కాబట్టి, వారు వాటిని పారవేయలేదు, సిమ్ కార్డుల్ని మార్చలేదు. దీంతో పోలీసుల పని మరింత సులువైంది. టీ డబ్బులు పేటీఎం చేసిన ఫోన్ నెంబర్ ఆధారంగా ఆ దొంగల్ని ట్రేస్ చేశారు. ఇద్దర్నీ పట్టుకుని నగలు స్వాధీనం చేసుకున్నారు. టీ కొట్టు దగ్గర దొంగలు చేసిన పేటీఎం లావాదేవీ వారిని పట్టించింది. అక్కడ క్యాష్ ఇచ్చి వెళ్లిపోయి ఉంటే ఈ కేసు ఇంకా తేలేది కాదు. దొంగలు ఆన్ లైన్ లావాదేవీతో సింపుల్ గా పనైపోయిందని భావించారు. పోలీసులకు అదే కీలక ఆధారంగా దొరికింది, దొంగలు పట్టుబడ్డారు.

Tags:    
Advertisement

Similar News