బీజేపీ నేత దాష్టీకం.. 16 మంది దళితుల నిర్బంధం, దాడి.. బిడ్డను కోల్పోయిన గర్భిణి

బీజేపీ నేత జగదీశ గౌడ తన కాఫీ తోటలో 16 మంది దళితులను రోజుల తరబడి నిర్బంధించాడు. వారి దగ్గర ఉన్న ఫోన్లను కూడా లాక్కొని తీవ్రంగా దాడి చేశాడు. ఈ క్రమంలో గర్భంతో ఓ మహిళకు అబార్షన్ జరిగింది.

Advertisement
Update:2022-10-11 18:25 IST

దళితులపై జరుగుతున్న ఆగడాలకు మరో ఘటన తోడైంది. బీజేపీ నేత 16 మంది దళితులను రోజుల తరబడి నిర్బంధించడమే కాకుండా వీరిపై అనుచితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఓ గర్భిణి తన బిడ్డను కూడా కోల్పోయింది.ఈ హృదయ విదారక ఘటన కర్ణాటకలో చోటు చేసుకున్నది. చిక్‌మగళూరు జిల్లాకు చెందిన బీజేపీ నేత జగదీశ గౌడ తన కాఫీ తోటలో 16 మంది దళితులను రోజుల తరబడి నిర్బంధించాడు. వారి దగ్గర ఉన్న ఫోన్లను కూడా లాక్కొని తీవ్రంగా దాడి చేశాడు. ఈ క్రమంలో గర్భంతో ఓ మహిళకు అబార్షన్ జరిగింది. దాంతో ఆమెను కాఫీ తోటలో నుంచి పంపించివేశాడు. ఆమె సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బీజేపీ నేత జగదీశ గౌడ ఆయన కుమారుడు తిలక్ గౌడలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తండ్రి కొడుకు ఇద్దరూ పోలీసులు పరారీలో ఉండటంతో వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పోలీసులు గాలిస్తున్నారు. 16 మంది దళితులు జెనుగడ్డె ప్రాంతంలోని కాఫీ తోటలో పని చేస్తున్నారు. జగదీశ గౌడ నుంచి వాళ్లు కొంత మొత్తం అప్పుగా తీసుకున్నారు. అయితే అప్పు తిరిగి చెల్లించక పోవడంతో వారందరినీ నిర్బంధించి అప్పు కట్టాలంటూ వేధించాడు. వారిలో ఓ గర్భిణి కూడా ఉన్నది.

కాగా, అక్టోబర్ 8న కొంత మంది బెళెహోన్నూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాళ్ల బంధువులను జగదీశ గౌడ హింసిస్తున్నాడంటూ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో కాని మరుసటి రోజు ఆ కంప్లైంట్ వాపస్ తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. కానీ, ఆ తర్వాత రోజు ఓ గర్భిణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు చిక్‌మగళూరు ఎస్పీ తెలిపారు.

కేసు విచారణలో భాగంగా కాఫీ తోట వద్దకు వెళ్లి చూడగా దాదాపు 10 మందిని ఓ గదిలో బంధీలుగా ఉన్నారు. పోలీసులు వారిని అక్కడి నుంచి విడిపించారు. నాలుగు కుటుంబాలకు చెందిన 16 మందిని 15 రోజులుగా అక్కడ బంధించి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. వాళ్లందరూ ఎస్సీలే అని పోలీసులు ధృవీకరించారు. తనను ఒక రోజంతా గదిలోనే ఉంచి కొట్టారని, బూతులు తిట్టారని.. ఆ తర్వాత ఫోన్ లాక్కున్నట్లు గర్భస్రావం జరిగిన అర్పిత అనే మహిళ తెలిపింది. అర్పిత తల్లి మీడియాతో మాట్లాడుతూ.. తన కూతురు రెండు నెలల గర్భంతో ఉన్నదని.. అయినా సరే జగదీశ గౌడ ఏ మాత్రం కరుణించకుండా కూతురిని, అల్లుడిని ఇష్టమొచ్చినట్లు చితకబాదాడని తెలిపింది. ఆ దాడి వల్లే తన కూతురు గర్భం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.

కాగా, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వరసిద్ధి వేణుగోపాల్ ఈ ఘటనపై స్పందించారు. జగదీశ్ గౌడ, ఆయన కుమారుడికి తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆయన మా పార్టీ సభ్యుడు కాదని తెలిపారు. అయితే జగదీశ గౌడ బీజేపీకి మద్దతు తెలిపేవాడని మాత్రం వేణుగోపాల్ చెప్పుకొచ్చారు.

Tags:    
Advertisement

Similar News