‘కాంతారా2’ బడ్జెట్ ఎంత? కథ ఏమిటి?

రిషభ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన హోంబలే ఫిలిమ్స్ పానిండియా హిట్ ‘కాంతారా’ (2022) సంచలన విజయం గురించి తెలిసిందే. దీన్ని కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తే అద్భుతంగా 410 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పుడు ‘కాంతారా 2’ తెరకెక్కుతోంది. దీని బడ్జెట్ ని ఏకంగా 125 కోట్ల రూపాయలకి పెంచేశాడు రిషభ్ శెట్టి.

Advertisement
Update:2024-01-10 16:02 IST

రిషభ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన హోంబలే ఫిలిమ్స్ పానిండియా హిట్ ‘కాంతారా’ (2022) సంచలన విజయం గురించి తెలిసిందే. దీన్ని కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తే అద్భుతంగా 410 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పుడు ‘కాంతారా 2’ తెరకెక్కుతోంది. దీని బడ్జెట్ ని ఏకంగా 125 కోట్ల రూపాయలకి పెంచేశాడు రిషభ్ శెట్టి. దీని కథ, నిర్మాణ విలువలు భారీ బడ్జెట్ ని కోరుకుంటాయని, అందువల్ల ‘కాంతారా2’ కి బడ్జెట్ 8 రెట్లు పెంచినట్టు తెలుస్తోంది. అయితే ‘కాంతారా2’, ‘కాంతారా’ కి సీక్వెల్ కాదు. ‘కాంతారా’ కి ముందు జరిగిన కథతో ప్రీక్వెల్ ‘కాంతారా2’. అంటే నిజానికి ‘కాంతారా’ లో మనం చూసింది పార్ట్ 2 కథ. రాబోయే ‘కాంతారా2’ లో చూడబోయేది పార్ట్ 1 కథ. అంటే ఈ ఫ్రాంచైజీ కథ ఇక్కడ్నుంచీ ప్రారంభమవుతుందన్న మాట!

ప్రీక్వెల్ మూవీస్ తీయడం కొత్తేం కాదు. హాలీవుడ్ లో 1915 లో తీసిన ‘ది గోలెమ్’ కి ముందు కథతో ప్రీక్వెల్ గా 1920 లో తీసిన ‘ది గోలెమ్ : హౌ హీ కేమ్ ఇన్ టు ది వరల్డ్’ మొదలుకొని, 2005 లో తీసిన ‘సా 2’ కి ముందు కథతో ప్రీక్వెల్ గా 2023 లో తీసిన ‘సా ఎక్స్’ వరకూ వందకి పైగా వున్నాయి. మన సౌత్ మేకర్స్ ఇప్పుడు ప్రీక్వెల్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టున్నారు. కమల్ హాసన్ తో శంకర్ తీస్తున్న ‘ఇండియన్2’ 1996 లో తీసిన ‘ఇండియన్’ కి ముందు కథతో ప్రీక్వెల్. అలాగే ఆర్యతో పా. రంజిత్ తీస్తున్న ‘సార్పట్టా2’ 2021లో తీసిన ‘సార్పట్టా’ కి ముందు కథతో ప్రీక్వెల్. ఇప్పుడు రిషభ్ శెట్టి ‘కాంతారా’ కి ప్రీక్వెల్ తలపెట్టాడు.

సరే, ఏమిటీ ప్రీక్వెల్ లో కథ? పురాణాల నుంచి ప్రేరణ పొందిన కథ. క్రీ.శ. 301-400 కాలం నాటి కర్నాటకలో పంజుర్లీ దేవత, గుళిగ దేవతల చారిత్రక మూలాల్ని స్పర్శిస్తూ సాంస్కృతిక- సామాజిక చిత్రణలతో ప్రేక్షకులకి జ్ఞాన వికాసం కలగజేయడం లక్ష్యంగా పెట్టుకున్న కథ. ‘కాంతారా’ లో చూపించింది ఈ దేవతల కథే. ప్రీక్వెల్ లో ఈ దేవతల ప్రారంభ కథ చూపబోతున్నాడు. 'కాంతారా' ద్వారా ప్రేక్షకులకి పంజుర్లీ దైవ ప్రపంచం గురించి ఒక సంగ్రహావలోకనం అందిస్తే, ఈ ప్రీక్వెల్ ద్వారా పంజుర్లీ, గుళిగ దైవాలు రెండింటి కథల్ని మేళవించి సమ్మోహనకర కథనంతో ఇతివృత్త లోతుపాతుల్ని జోడించడం ద్వారా, సినిమాటిక్ అనుభవాన్ని ఎలివేట్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఉన్నత సినిమాటిక్ విలువలకి పేరుగాంచిన హోంబలే ఫిలిమ్స్ (సాలార్, కేజీఎఫ్ 1,2) మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే టీజర్ విడుదల చేశారు. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ లోనే ప్రారంభించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మార్చికల్లా షూటింగ్ ముగుస్తుంది. 2024 చివర్లో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఒక సినిమాటిక్ మాస్టర్‌పీస్‌ గా రూపొందించడానికి ఎక్కువ సమయమే కేటాయిస్తున్నారు. ‘కాంతారా’ ని చిత్రీకరించిన రిషభ్ శెట్టి స్వస్థలమైన కందపుర నేపథ్యంలో ప్రీక్వెల్‌లో నిర్మాణం జరుగుతోంది.

2022 సెప్టెంబర్ లో విడుదలైన ‘కాంతారా’ లో రిషభ్ శెట్టి - సప్తమీ గౌడ హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రీక్వెల్ తారాగణాన్ని, సాంకేతిక వర్గాన్ని ఇంకా ప్రకటించాల్సి వుంది. ‘కాంతారా’ అంటే మాయారణ్యమని అర్ధం. ఆ మాయారణ్యం, ఆ ప్రాంతం చుట్టూ జరిగే కథ ఇది. ‘కాంతారా’ ని కన్నడలో విజయం సాధించిన తర్వాతే ఇతర భాషల్లో విడుదల చేశారు. కర్నాటక అంతటా 250 కంటే ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. అదే సమయంలో అమెరికా, బ్రిటన్, యూరప్, గల్ఫ్, ఆస్ట్రేలియా, వియత్నాం లలో లో కూడా విడుదలైంది. మన దేశంలో హిందీ వెర్షన్‌ని భారీ స్థాయిలో 2500 స్క్రీన్‌లలో విడుదల చేశారు. ‘కాంతారా’ ప్రీక్వెల్ ఇంకెన్ని రికార్డుల్ని బద్దలు కొడుతుందో చూడాలి.


Full View


Tags:    
Advertisement

Similar News