సల్మాన్‌కు బెదిరింపులు.. కూరగాయల వ్యాపారి అరెస్ట్‌

లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరుతో ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన కూరగాయల వ్యాపారి ఇదంతా చేసినట్లు గుర్తించిన ముంబయి పోలీసులు

Advertisement
Update:2024-10-24 11:33 IST

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి వరుస బెదిరింపులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరుతో రూ. 5 కోట్లు డిమాండ్‌ చేస్తూ.. ఇటీవల ముంబాయి ట్రాఫిక్‌ పోలీసులకు ఓ మెసేజ్‌ రావడం కలకలం సృష్టించింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు తాజాగా ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన 24 ఏళ్ల కూరగాయల వ్యాపారిని అరెస్ట్‌ చేశారు. నిందితుడిని షేక్ హుస్సేన్ షేక్ మౌసిన్‌గా గుర్తించారు.తక్కువ సమయంలో అధిక మొత్తంలో డబ్బు సంపాదించడానికే అతను ఇలా ప్లాన్‌ చేశాడని అధికారులు భావిస్తున్నారు.

ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు ఓ ఆగంతకుడి నుంచి మెసేజ్‌ వచ్చిన విషయం విదితమే. 'ఈ బెదిరింపులను తేలికగా తీసుకోవద్దు. సల్మాన్‌ఖాన్‌ ప్రాణాలతో ఉండాలన్నా.. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో శత్రుత్వాన్నికి స్వస్తి పలకాలన్నా ఆయన రూ. 5 కోట్లు చెల్లించాలి. ఈ డబ్బులు ఇవ్వకపోతే ఎన్సీపీ సీనియర్‌ నేత సిద్ధిఖీ (ఇటీవల హత్యకు గురైన) కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.' అని మెసేజ్‌ పంపాడు. ఆ తర్వాత మరో మెసేజ్‌ కూడా పంపాడు. 'నేను కావాలని బెదిరింపులకు పాల్పడలేదు. అనుకోకుండా జరిగిపోయింది. క్షమించండి' అని పేర్కొన్నాడు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలోనే ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన కూరగాయల వ్యాపారి ఇదంతా చేసినట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.



Tags:    
Advertisement

Similar News