తగ్గేదేలే.. రెండో సినిమాకు 'ది లెజెండ్' శరవణన్ రెడీ
భారీ నష్టాలు వచ్చినా తాను మాత్రం సినిమాలు తీయడం ఆపేది లేదని శరవణన్ అంటున్నారు. మొదటి చిత్రం బాక్సాఫీస్ వద్ద అడ్డంగా బోల్తా కొట్టినా.. రెండో సినిమాకు ప్లాన్ చేస్తున్నారు.
సినిమా తీయాలంటే డబ్బు ఉంటే సరిపోతుంది. ఎవరినైనా హీరోగా పెట్టి సినిమా తీసేయవచ్చు. కానీ జనాలు మాత్రం ఆదరిస్తారనే గ్యారెంటీ ఉండదు. కథలో బలం, సినిమాలో విషయం ఉంటే హీరో ఎవరనేది చూడకుండా హిట్ చేస్తారు. సినిమా తెరపై కనిపించాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అలాంటి ఆసక్తి కలిగిన బడా వ్యాపారి అరుళ్ శరవణన్ తన దగ్గరున్న డబ్బుతో ఓ సినిమా తీశారు. తానే హీరోగా 'ది లెజెండ్' అనే సినిమా తీసి ప్రేక్షకుల మీదకు వదిలారు. దాదాపు రూ. 60 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే.. కనీసం రూ. 10 కోట్లు కూడా వసూలు చేయలేదు. సినిమా కోసం ఊర్వశి రౌతేలా, గీతిక తివారి వంటి బాలీవుడ్ నటీమణులను.. హారిస్ జయరాజ్ లాంటి బడా మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకున్నారు. భారీ ఎత్తున ఖర్చు పెట్టి సెట్లు వేసి అద్భుతంగా చిత్రీకరించారు. కానీ హీరో మొహంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ లేవు. లేటు వయసులో కుర్రాడిలా నటించడంతో ఎమోషనల్ సీన్స్‌లో కూడా ప్రేక్షకులు నవ్వుకున్నారు. మొత్తానికి తన సినిమా తపన తీర్చుకున్నారని, ఇక రెండో సినిమా ముచ్చటే లేదని అందరూ అనుకున్నారు.
భారీ నష్టాలు వచ్చినా తాను మాత్రం సినిమాలు తీయడం ఆపేది లేదని శరవణన్ అంటున్నారు. మొదటి చిత్రం బాక్సాఫీస్ వద్ద అడ్డంగా బోల్తా కొట్టినా.. రెండో సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. తనను సైడ్ క్యారెక్టర్‌గా కూడా పనికి రాడని విమర్శించిన వారి నోళ్లు మూయించడానికి ఈ సారి కొత్త దర్శకుడితో.. అద్భుతమైన కథతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తున్నది. శరవణన్ త్వరలోనే కొత్త సినిమాను ప్రకటించనున్నట్లు కోలీవుడ్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే కథ సిద్ధమైందని.. ఈ సారి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ముందుకు రాబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను గ్రాండ్ ఈవెంట్‌లో అనౌన్స్ చేయడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తున్నది.
తన శరవణన్ స్టోర్ యాడ్స్‌లో తానే కనపడే శరవణన్.. అనేక మంది హీరోయిన్లతో షూటింగ్స్ చేశారు. 53 ఏళ్ల వయసులో తన సినిమా కలను నెరవేర్చుకున్నారు. అయితే ఆశించిన మేర ఫలితం రాలేదు. పాన్ ఇండియా సినిమాగా ప్రొజెక్ట్ చేసిన 'ది లెజెండ్' అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ముంబై వెళ్లి మరీ గ్రాండ్ ఈవెంట్స్ చేసినా.. ఒక్కరిని కూడా థియేటర్లకు రప్పించలేక పోయారు. బడా హీరోలే ఒక సినిమా ఫ్లాప్ అయితే రెండో సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసుకుంటారు. కానీ శరవణన్ మాత్రం.. ఈ ఏడాదే రెండో సినిమా మొదలు పెడుతుండటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.